దేశాన్ని వణికించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. అమిత్ షా కీలక ప్రకటన!
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరో చారిత్రాత్మక విజయాలను నమోదు చేశాయి. కుల్గామ్ జిల్లాలో లష్కర్-ఎ-తోయిబా (LeT) ఉగ్రవాద మూకల ఆటకట్టిస్తూ, లోయలో చివరి స్థానిక ఉగ్రవాదిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ కమాండర్ లతీఫ్ భట్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ మరియు నిఘా వర్గాల వీర జవాన్లకు దేశం తరఫున సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.
పక్కా వ్యూహంతో ఉగ్రవాది ఏరివేత..
జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్ విభాగాలు అత్యంత సమన్వయంతో ఈ ఉమ్మడి ఆపరేషన్‌ను విజయవంతం చేశాయని అమిత్ షా పేర్కొన్నారు. కుల్గామ్‌లో జరిగిన ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో లష్కర్ కమాండర్ లతీఫ్ భట్‌తో పాటు, అంతకుముందు రోజు జరిగిన మరో ఆపరేషన్‌లో అతడి సహచరుడు ఉమర్ నిసార్ దార్ కూడా హతమయ్యాడని తెలిపారు. ఉగ్రవాది మసీదులో తలదాచుకున్నప్పటికీ, పవిత్ర స్థలానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా బలగాలు అత్యంత సంయతనంతో, చాకచక్యంగా ఈ ఆపరేషన్‌ను ముగించడం విశేషం.

లొంగిపోవాలని కోరినా మారని ఉన్మాదం..
ఎన్‌కౌంటర్ సమయంలో భద్రతా బలగాలు మానవతా దృక్పథంతో వ్యవహరించి, లతీఫ్ భట్‌కు లొంగిపోయేందుకు పలుమార్లు అవకాశం కల్పించాయి. వీడియో కాల్స్ ద్వారా స్వయంగా అధికారులు మాట్లాడి బతిమలాడినప్పటికీ, ఆ ఉగ్రవాది తన అహాన్ని వీడలేదు. చివరికి బలగాలు జరిపిన కాల్పుల్లో హతమైన లతీఫ్ భట్ మృతదేహంతో పాటు ఆయుధాన్ని కూడా ఎన్‌కౌంటర్ స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు స్పష్టం చేశారు.
సీసీటీవీ దృశ్యాలే పట్టిచ్చిన కుట్ర..
నవంబర్ 11న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడి వెనుక ఈ ఉగ్రవాదుల హస్తం ఉందని పోలీసులు ముందుగానే గుర్తించారు. దాడికి రెండు రోజుల ముందు (నవంబర్ 10న) మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్ ప్రాంతాల్లో లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్ కలిసి రెక్కీ నిర్వహిస్తున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఈ పక్కా ఆధారాలతోనే బలగాలు ఉగ్రవాదుల కదలికలను నిరంతరం పర్యవేక్షించి, లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ప్రధాన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించాయి. ఈ ఆపరేషన్‌తో కశ్మీర్‌లో మరో పెద్ద కుట్ర భగ్నమైందని అధికారులు తెలిపారు.














Click it and Unblock the Notifications
