టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పేరు ఇదే, జెండాలో జయలలిత, అన్నాడీఎంకేకి పక్కలో బల్లెం!
Recommended Video

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులను ముప్పుతిప్పలు పెడుతున్న చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్మే టీటీవీ దినకరన్ గురువారం కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు. తమిళనాడులోని మదురై జిల్లా మేలూరులో టీటీవీ దినకరన్ కొత్త పార్టీని, జెండాను ఆవిష్కరించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మీద 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించిన టీటీవీ దినకరన్ ఇక రాజకీయంగా మరో మొట్టు ఎక్కడానికి సిద్దం అయ్యారు.

సీఎం రాజీనామా
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి మెజారిటీ శాసన సభ్యుల మద్దతు లేదని, వెంటనే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చెయ్యాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు.

అన్నాడీఎంకేకి సినిమా
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి త్వరలోనే సినిమా చూపిస్తానని టీటీవీ దినకరన్ చాలెంజ్ చేశారు. 18 మంది అన్నాడీఎంకే పార్టీ అనర్హత వేటు కేసు కోర్టులో ఉందని, తుదితీర్పు వచ్చిన తరువాత తన సత్తా చూపిస్తానని టీటీవీ దినకరన్ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను హెచ్చరించారు.

డీఎంకేతో దోస్తి
తమిళనాడులో అధికారంలో ఉన్నా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దించడానికి అవసరమైతే ప్రతిపక్షం డీఎంకేతో కలవడానికి తాము సిద్దంగా ఉన్నామని చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు ఇప్పటికే బహిరంగంగా చెప్పారు.

ఢిల్లీ హైకోర్టు ఆదేశం
టీటీవీ దినకరన్ గతంలో తాను ఆర్ కే నగర్ లో పోటీ చేసిన సమయంలో ఇచ్చిన ప్రెషర్ కుక్కర్ ను తన కొత్త పార్టీకి కేటాయించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. టీటీవీ దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ కేటాయించాలని, అతను సూచించిన పార్టీ పేరును కేటాయించాలని ఢీహైకోర్టు ఎన్నికల కమీషన్ కు సూచించింది.

రూ. 50 కోట్ల లంచం కేసు
అన్నాడీఎంకే పార్టీ పేరు, రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి చివరి నిమిషం వరకూ పోరాటం చేసిన టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమీషన్ అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని కేసు నమోదు అయ్యింది. బుధవారం ఢిల్లీలోని కోర్టులో విచారణకు హాజరైన టీటీవీ దినకరన్ తాను ఈ కోసు నుంచి నిర్దోషిగా విడుదల అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

ఏఎంఎంకే
టీటీవీ దినకరన్ గురువారం మదురైలోని మేలూరులో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) తన పార్టీ పేరు అని టీటీవీ దినకరన్ ప్రకటించారు. ఇక నుంచి తాను, తన మద్దతుదారులు ఇదే పార్టీ పేరుతో పోటీ చేస్తానని టీటీవీ దినకరన్ అన్నారు.

జయలలిత బొమ్మ ?
నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా మధ్యలో జయలలిత ఆకారంలో ఉన్న ఓ బొమ్మను టీటీవీ దినకరన్ తన జెండాలో పెట్టారు. అయితే ఆ ఫోటో జయలలితదా లేక చిన్నమ్మ శశికళదా అనే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications