దేశంలో కరోనా వికృతరూపం: నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదా?: కొత్తగా 77 వేలకు పైగా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరింత భయానకంగా మారింది. భీకరంగా విస్తరిస్తోంది. రోజువారీ కొత్త కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 75 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడమే ఓ సంచలనంగా మారితే.. ఆ మరుసటి రోజే ఆ సంఖ్యను మించిపోవడం ఉలిక్కిపడేలా చేస్తోంది. అన్‌లాక్ తరువాతే కరోనా కొత్త కేసుల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంటోంది. మున్ముందు కరోనా పాజిటివ్ కేసులు తీవ్రత ఏ స్థాయిలో ఉంటోందో ఊహించుకోవడానికి భయం కలిగించేలా తయారైంది. దానికి తోడు మరణాలు అదే రేంజ్‌లో రికార్డు అవుతున్నాయి. వెయ్యిమందికి పైగా మృత్యువాత పడుతున్నారు.

వరుసగా రెండోరోజూ అదే స్పీడు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 77,266 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1057 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,87,501కు చేరుకుంది. ఇప్పటిదాకా 61,529 మంది మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023కు చేరుకుంది. 25,83,948 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. తాజా బులెటిన్‌లో నమోదైన వివరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

లక్షకు చేరువ అవుతాయా?
77 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత తొలిసారిగా 75 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశం యావత్తూ ఉలిక్కి పడింది. ఆ మరుసటి రోజే 77266 కొత్త కేసులు వెలుగులోకి రావడం మరింత ఆందోళనలోకి నెట్టేసినట్టయింది. ఇదే వేగం మున్ముందూ కనిపించే అవకాశాలు లేకపోలేదు. క్రమంగా రోజువారీ కొత్త కేసులు లక్షకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేని దుస్థితి దేశంలో నెలకొందని అంటున్నారు. అన్‌లాక్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

నిర్లక్ష్యానికి మూల్యం..
ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. కరోనాను నియంత్రించడానికి తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఉపకరించిన దాఖలాలు లేవనేది దీనితో స్పష్టమౌతోంది. మాస్కులను ధరించకపోవడం, శానిటైజర్లను వినియోగించపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వంటి చర్యల వల్లే దేశంలో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎందుకు ఆందోళన వ్యక్తం చేసిందనేది దీనితో రుజవవుతోంది.
Recommended Video

కరోనా టెస్టుల్లో జోరు..
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు మూడు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 3,94,77,848 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజులో 9,01,338 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. 60 వేలకు పైగా శాంపిళ్లను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications