భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో భాగంగా గాలింపు చేపడుతున్న భద్రతా బలగాలకు శనివారం ఉదయం 8 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే వారు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మరోవైపు, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణపూర్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో చోట చేసుకుంది. ఘటనాస్థలి నుంచి మవోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను రాయ్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

జవాన్లకు మెరుగైన చికిత్స అందించడం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్రాజ్ వెల్లడించారు. కాగా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
అబూజ్మడ్.. గోవా రాష్ట్రం కంటే విస్తారమైన అన్-సర్వేడ్ భూమి. ఇది ఎక్కువగా నారాయణపూర్ జిల్లాలో ఉంది. దాని చిన్న భాగాలు బీజాపూర్, దంతేవాడ, కంకేర్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి . గతేడాది వరకు దట్టమైన ఈ అటవీప్రాంతం, ప్రభుత్వాధికారులు లేకపోవటం వల్ల ఈ ప్రాంతం మావోయిస్టులకు స్వర్గధామంగా ఉండేది. అయితే, ఈ సంవత్సరం, ప్రభుత్వం చేపట్టిన 'మాద్ బచావో' (సేవ్ మాద్) ప్రచారంలో భాగంగా, అబుజ్మద్, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్లలో 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.
కాగా, శనివారం నాటి ఎన్‌కౌంటర్‌తో.. బస్తర్ ప్రాంతంలో మరణించిన మొత్తం మావోయిస్టుల సంఖ్య ఈ సంవత్సరం 197కి పెరిగింది. 2000లో ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పటి నుంచి ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ఈ ఏడాది ఇక్కడ మావోయిస్టుల చేతిలో 17 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 60 మంది పౌరులు మరణించారు.












Click it and Unblock the Notifications