ఒడిశాలో మరో ఘటన- సికింద్రాబాద్-అగర్తల ఎక్స్ ప్రెస్ రైల్లో అగ్నిప్రమాదం...
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొని 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను జనం మర్చిపోకముందే ఇవాళ మరో ఘటన కలకలం రేపింది. రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్న మరో ఎక్స్ ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. అసలే బాలాసోర్ రైలు ప్రమాదం గుర్తు చేసుకుని భయంభయంగా ప్రయాణిస్తున్న వీరంతా తాజా అగ్నిప్రమాదంతో కాసేపు ఆందోళన చెందారు.
ఇవాళ ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ఏసీ కోచ్‌లోని యూనిట్ నుండి పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా లోపల మంటలు చెలరేగి ఈ పొగ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రైలు ప్రయాణీకులలో భయాందోళన రేపింది. పరిస్ధితి తెలుసుకున్న రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్‌లో రైలును ఆపారు. రైలు బి-5 కోచ్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు బ్రహ్మపూర్ స్టేషన్‌లో దిగారు.

వెంటనే పొగలను అదుపు చేసినప్పటికీ మళ్లీ ఇబ్బందులు తప్పవని భయాందోళనకు గురైన ప్రయాణికులు కోచ్‌లో ప్రయాణించడానికి నిరాకరించారు. కోచ్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. పొగ అదుపులోకి వచ్చిన తర్వాత రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని బ్రహ్మపూర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న కోచ్ నెం. B-5లో చిన్న విద్యుత్ సమస్య సంభవించినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించారని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి తెలిపారు.
అసలే బాలాసోర్ ఘటనతో భయపడుతున్న ప్రయాణికులు అదీ ఒడిశాలోనే చోటు చేసుకున్న ఈ చిన్న ఘటనకూ ఉలిక్కి పడ్డారు. అయితే అధికారులు వారికి సర్దిచెప్పి పంపించాల్సి వచ్చింది. అయితే ప్రయాణికుల్లో భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications