ఆధారాల్లేవ్!,అసలది వేధింపుల పర్వమే కాదు: బెంగుళూరు కమిషనర్ యూటర్న్
ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిషనర్ ప్రవీణ్ సూద్.. ఇదసలు వేధింపుల పర్వం కాదని, ఇదో అవాంఛనీయ ఘటన అని పేర్కొనడం గమనార్హం.
బెంగుళూరు: ఐటీ హబ్ బెంగుళూరులో జరిగిన కీచకపర్వంపై కమిషనర్ ప్రవీణ్ సూద్ యూ టర్న్ తీసుకున్నారు. అమ్మాయిలపై వేధింపులకు సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఆయన ప్రకటించడం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీసింది.
కమిషనర్ ప్రవీణ్ సూద్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. లైంగిక వేధింపులకు సంబంధించి తమకెలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, బాధితులు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఘటనకు సంబంధించి ఆరు వేర్వేరు కేసులు మాత్రం నమోదు చేసినట్టుగా తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘటనను పూర్తిగా పరిశీలించినప్పటికీ.. తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని కమిషనర్ పేర్కొనడం గమనార్హం. దాదాపు 45 నుంచి 60 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. దీనికి చాలా సమయం పడుతుందని, మొత్తం టీమ్ అంతా కెమెరా ఫుటేజీని పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారని, ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లభ్యమవలేదని అన్నారు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిషనర్ ప్రవీణ్ సూద్.. ఇదసలు వేధింపుల పర్వం కాదని, ఇదో అవాంఛనీయ ఘటన అని పేర్కొనడం గమనార్హం. దీన్ని వేధింపుల పర్వంగా పేర్కొనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
'డిసెంబర్ 31 రాత్రి.. ఎంజీ రోడ్డు మీద చాలా మంది పోలీసు భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 20మీడియా సంస్థల ఓబీ వ్యాన్స్ ఉన్నాయి. పైగా.. మరుసటిరోజు పలానా ఘటన జరిగిందని ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. ఈరోజుల్లో ఏదైనా జరగరానిది జరిగితే క్షణాల్లో అదెంత వైరల్ గా మారిపోతుందో తెలియనిదా!' అంటూ కమిషనర్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే, పలు లోకల్ మీడియా ఛానెళ్లు..పలువురు బాధిత అమ్మాయిల సాక్ష్యాన్ని జనం ముందు పెట్టిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను సైతం ప్రసారం చేసిన అక్కడి మీడియా చానెళ్లు.. అమ్మాయిలు సహాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాలను సైతం ప్రసారం చేశాయి.
మీడియా ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలు, కొంతమంది మహిళల ఆరోపణల మేరకు ఆరు వేర్వేరు కేసులు నమోదు చేసినట్టుగా కమిషనర్ తెలిపారు. బెంగుళూరు జరిగిన ఈ కీచకపర్వం గతేడాది జర్మనీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్బంగా జరిగిన లైంగిక దాడులను తలపించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్వయంగా హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. అమ్మాయిలదే తప్పనట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ లాంటివారు సైతం కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications