అనూహ్య కేసులో పురోగతి: నిందితుల చిత్రాలు విడుదల
ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈస్తర్ అనూహ్య (23) హత్య కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. అనూహ్య హత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న అనుమానితుల రేఖా చిత్రాలను పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అనూహ్య రక్త నమూనాలకు నిర్వహించిన పరీక్షల్లో మద్యం, మాదక ద్రవ్యాల ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రేత, బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల వద్ద అనుమానిత నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
తిలక్ టెర్మినస్‌లో రైలు దిగిన తర్వాత అనూహ్యతోపాటు వెంట నడిచిన అనుమానాస్పద వ్యక్తి రేఖా చిత్రాలను పోలీసులు గురువారం విడుదల చేశారు. అనూహ్యతోపాటు ఫ్లాట్ ఫాంపై కనిపిస్తున్న అనుమానాస్పద వ్యక్తి, అనూహ్యను కలవడానికి ముందు సుమారు అరంగటపాటు ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
అంతేగాక ఆ అనుమానాస్పద వ్యక్తి చేతిలో ఉన్నది మద్యం బాటిల్‌గానే పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో అతను మత్తులోనే ఉన్నట్లు సిసి కెమెరా ఫుటేజి పరిశీలనలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కాగా గురువారం విడుదల చేసిన అనుమానిత నిందితుల రేఖా చిత్రాలను మద్యం దుకాణాలు, బార్ షాపులలో చూపిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications