AP–TS Weather: రానున్న 3 రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, అల్పపీడనం
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కురిసిన వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రా ప్రాంతాలు వర్షాల నుంచి ఇంకా తేరుకోలేదు. పలుచోట్ల వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది.

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణతోపాటు ఏపీలోనూ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. తూర్పు దిశ నుంచి ఏపీ, తెలంగాణ వైపు వీస్తున్న గాలులతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
కాగా, ఈ ద్రోణి శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి రాయలసీమ, కోస్తాంధ్రాలోని పలు జిల్లాల వాసులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పలుచోట్ల ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈనేపథ్యంలో మళ్లీ వర్షాల సూచనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా, తిరుపతి, నెల్లూరు, కడప, అటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. పదుల సంఖ్య ప్రాణాలు కూడా కోల్పోయారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications