కాంగ్రెస్ బీజేపీలది భార్యభర్తల వ్యవహారం : కేజ్రీవాల్
పనాజీ : ముందునుంచి బీజేపీతో వైరాన్నే కొనసాగిస్తోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరోమారు బీజేపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలకు దిగారు. రెండూ పార్టీలు కలిసి దేశ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని, కాంగ్రెస్ బీజేపీ మధ్య భార్య భర్తల తరహా బంధం నడుస్తోందని ఎద్దేవా చేశారు.
సోమవారం పనాజీలో జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించిన మాట్లాడిన కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడ్డ తరహాలో కేవలం పైకి మాత్రమే రెండు పార్టీల మధ్య తగాదా ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఒక పార్టీ రహస్యాలు మరో పార్టీకి బాగా తెలుసునని అందుకే కాంగ్రెస్ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా మోడీ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కు చెందిన గోవా ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైళ్లన్నీ ఉన్నాయని, ఎన్ని ఆధారాలున్నా వాళ్లపై చర్యలు తీసుకోవడానికి మాత్రం కేంద్రం వెనుకాడుతోందన్నారు. అదే సమయంలో కేవలం ఆ ఫైళ్లను చూపించి కాంగ్రెస్‌ను బెదరించడానికి మాత్రం బీజేపీ నేతలు ప్రయత్నిస్తుంటారని, ఈ విషయాన్ని తనతో ఎవరో చెప్పారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సమష్టిగా ప్రజల్ని దోచుకుంటున్నాయని, యథేచ్చగా మాఫియా రాజ్యాలను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశాన్ని తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలన్న ఆలోచనతో రెండు పార్టీల మధ్య ఒప్పందమేదో జరిగి ఉంటుందన్నారు. అయితే అది లిఖితపూర్వక ఒప్పందం కాక అవగాహన మీద ఆధారపడే ఉండొచ్చునన్నారు .
గోవా ముఖ్యమంత్రిగా పారికర్ పదవికాలం ఎప్పుడో ముగిసిపోయినా.. ఇప్పటికే ఢిల్లీ కంటే ఎక్కువ గోవా సెక్రటేరియట్ లోనే ఆయన ఎక్కువగా అందుబాటులో ఉంటారని, వారాంతాల్లో ఫైళ్లన్నింటిని క్లియర్ చేసుకుని ఢిల్లీకి వస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ కొనసాగించిన అవినీతినే గోవాలో బీజేపీ కూడా కొనసాగిస్తోందని ఇప్పటికే నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నా బీజేపీ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కనీసం ఐదు హామిలనైనా నెరవేర్చారేమో చూపించాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications