అక్కడ మంచు కరిగితే.. ఇక్కడ వర్షాలు ఎందుకు పెరుగుతున్నాయి?
భూతాపం (Global Warming) ధ్రువ ప్రాంతాలను వణికిస్తోంది. ముఖ్యంగా ఆర్కిటిక్ మహాసముద్రంలో వేగంగా కరిగిపోతున్న మంచు, వేల మైళ్ల దూరంలో ఉన్న భారత దేశ వాతావరణంపై పెను ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ' (IITM) శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం.. ఆర్కిటిక్‌లో మంచు కరగడానికి, మన దేశంలోని నైరుతి రుతుపవనాలకు మధ్య విడదీయలేని సంబంధం ఉందని తేలింది.
1979 నుండి 2022 వరకు ఉన్న నాలుగు దశాబ్దాల వాతావరణ గణాంకాలను విశ్లేషించిన ఐఐటీఎం పరిశోధకులు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. జూన్, జూలై మాసాల్లో ఆర్కిటిక్ ప్రాంతంలో హిమం అధికంగా కరిగితే, దాని ప్రభావం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో భారత్‌లో కనిపిస్తుంది. ఆ సమయంలో మన దేశ పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో వర్షపాతం అసాధారణంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రుతుపవన గాలులు తమ దిశను మార్చుకుని పశ్చిమ వైపు మళ్లడమేనని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

Monsoon: వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం..
సాధారణంగా భారత వార్షిక వర్షపాతంలో 75 శాతం వాటా నైరుతి రుతుపవనాలదే ఉంటుంది. అయితే, ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల వాతావరణ పీడనంలో మార్పులు సంభవించి, రుతుపవన గాలులు తమ దిశను పశ్చిమ వైపుకు మళ్లించుకుంటున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షపాత పంపిణీలో అసమతుల్యత ఏర్పడుతోంది. ఒకప్పుడు సమృద్ధిగా వర్షాలు కురిసే ఈశాన్య రాష్ట్రాలు, గంగా మైదాన ప్రాంతాలు, హిమాలయాల్లో వర్షపాతం తగ్గుముఖం పడుతోంది. దీనికి విరుద్ధంగా, ఎడారి ప్రాంతాలైన రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అనూహ్యంగా వర్షాలు పెరుగుతున్నాయి. ఈ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
Monsoon లో ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయ్..
ఇటీవలి కాలంలో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే తీరులో కూడా పెను మార్పులు కనిపిస్తున్నాయి. గాలులు సాధారణం కంటే వేగంగా ప్రవేశించడమే కాకుండా, తక్కువ సమయంలోనే అత్యంత భారీ వర్షాలు (Cloudbursts) కురుస్తున్నాయి. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, వాయవ్య భారతంలో సాధారణం కంటే 27 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా లద్దాఖ్‌లో 342 శాతం, రాజస్థాన్‌లో 64 శాతం అదనపు వర్షాలు కురిశాయి. ఇలాంటి అసాధారణ మార్పుల వల్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం వంటి ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతుపవనాల గమనాన్ని కచ్చితంగా అంచనా వేయడం ఇప్పుడు శాస్త్రవేత్తలకు అతిపెద్ద సవాలుగా మారింది.












Click it and Unblock the Notifications