వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడేస్తున్నామా? వీటితో ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
యాంటీబయాటిక్స్

''అతి సర్వత్ర వర్జయేత్’’ అన్నారు పెద్దలు. ఇప్పటి కాలంలో ఈ మాట సరిగ్గా సరిపోయేది మనం ఇష్టమొచ్చినట్లు వాడుతున్న ఈ యాంటీబయాటిక్ మందులకి.

ఏటా నవంబర్ 18- 24 వ తారీఖు వరకు ప్రపంచ యాంటీబయాటిక్ అవగాహన వారంగా జరుపుతారు.

నిజంగా వైద్యులకెంత కావాలో అంతకన్నా ఎక్కువ అవగాహన ఈ మందుల వాడకంలో సాధారణ ప్రజలకు ఉండాలి. అప్పుడే మానవాళికి మొత్తంగా మేలు జరుగుతుంది.

అదుపు లేకుండా పెరిగితే ఒక చిన్న బాక్టీరియా వల్ల మన శరీరానికి ఎంత ముప్పు కదా?! అలాగే అడ్డూ- అదుపూ, అవగాహన లేకుండా ఆ బాక్టీరియాలను చంపాలనుకుంటే అది కూడా చాలా ప్రమాదం.

యాంటీబయాటిక్స్

"చేపను పట్టడానికి వల కాకుండా ఎప్పుడైనా నిచ్చెన వాడారా?!

లీటరు అరటి పళ్లు ఎక్కడైనా కొన్నారా?!

సెలూన్ షాపులో బట్టలు కుట్టించుకొచ్చారా ఎవరైనా?!"

ఏంటి? చదువుతుంటూనే నవ్వొస్తుంది కదా?! అర్థంపర్థం లేని మాటలు మరి. ఇలానే ఉంటుంది మనం యాంటీబయాటిక్స్ వాడే తీరు.

పైగా యాంటీబయాటిక్స్‌ను అడ్డదిడ్డంగా వాడే దేశాల్లో మనది అగ్రస్థానం.

అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లోపం అన్ని కలిసి మనదేశంలో పరిస్థితి ఇలా తయారయింది.

మందులు

యాంటీబయాటిక్స్ వాడితే ఏమిటి?

2019 అధ్యయనాల ప్రకారం, ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్- మలేరియాలకంటే ఎక్కువ శాతం మంది మరణిస్తుంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల.

ప్రపంచంలో అతి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే దేశాల్లో భారత్‌ది అగ్రస్థానం. అలాగే ఈ మందుల్ని సరైన రీతిలో వాడకపోవటంలో కూడా మనదే అగ్రస్థానం.

ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేసే దేశం ఇండియా. డాక్టర్ చిట్టి లేకుండానే దుకాణంలో ఎక్కువగా అమ్మేది కూడా ఇండియాలోనే.

ఈ అమ్మకాల్లో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ మొత్తంగా చూస్తే సరైన రీతిలో వాడకపోవడం మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కువే.

యాంటీబయాటిక్స్

సూపర్‌ బగ్స్ ఇవీ

  • మల్టీడ్రగ్ రెసిస్టెంట్ స్యూడోమోనాస్
  • వాంకోమైసిన్ రెసిస్టెంట్ ఎంటెరోకోకస్
  • ఈఎస్‌బీఎల్- ప్రొడ్యూసింగ్ ఎంటెరోబ్యాక్టెరియేస్
  • ఎంఆర్ఎస్ఏ, వీఆర్ఎస్ఏ
  • కార్బపెనామ్ రెస్టిస్టెంట్ ఎంటెరోబ్యాక్టెరియేస్
యాంటీబయాటిక్స్

ఈ సూపర్ బగ్ ముప్పు ఎలా ఉందో చూద్దాం.

ఐసీయూలో ప్రతి పది మంది రోగుల్లో నలుగురికి ఈ ఔషధ నిరోధక బ్యాక్టీరియా సోకి ఉంటుంది. దానితో ఆ బాక్టీరియాకు సాధారణంగా వాడే మందులు కాక మరింత పెద్దవి, ఖరీదైనవి, ఒక్కోసారి శరీరానికి హాని కలిగించేవి అయినా, వాడాల్సి వస్తుంది.

నిర్ణీత సమయం కన్నా ఎక్కువ రోజులు కూడా యాంటీబయాటిక్స్ వాడాల్సి రావచ్చు. సాధారణంగా ఎటువంటి రసాయనాలనైనా ప్రక్షాళన చేసే అవయవాలు కాలేయం, కిడ్నీలు.

ఎక్కువ శక్తివంతమైన మందులు, ఎక్కువకాలం వాడటం వలన ఈ రెండు అవయవాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఏ విధంగా అయినా అది ముప్పే.

తాత్కాలికంగా అయితే, వాడే మందుల్ని ఆపడంవల్ల బాక్టీరియా మరింత బలపడపతుంది. శాశ్వతంగా అయితే, లివర్-కిడ్నీలతోపాటు మెల్లమెల్లగా ఇతర అవయవాలు కూడా పాడై ప్రాణాంతకమవుతుంది.

నిపుణుల అంచనా ప్రకారం 2050నాటికి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ఎంతలా పెరిగిపోతుందంటే ఏటా కోటిమంది కేవలం ఏఎంఆర్ వల్లనే చనిపోతారు. అన్ని ఇతర కారణాలు కలిపినా ఏఎంఆర్ వల్ల సంభవించే మరణాలకంటే తక్కువే ఉంటాయట.

మానవాళిని మట్టుబెట్టడానికి మరే ఇతర సునామీలు, తీవ్రవాదాలు అక్కర్లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది మనం మన పిల్లల తరాలపై తెలిసితెలిసీ ప్రయోగించబోయే బయోటెర్రరిజమ్..

1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియమ్ అనే ఫంగస్ నుండి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్‌ను కనుగొన్నాడు. పెన్సిలిన్ తర్వాత వైద్య విధానం ఎంతగానో మారింది, కొన్ని కోట్ల ప్రాణాలు నిలిచాయి.

అంత గొప్ప మందును మనకు అందించిన నోబెల్ బహుమతి గ్రహీత ఫ్లెమింగ్, అంతకన్నా గొప్ప సూచన కూడా అప్పట్లోనే చేశారు.

'సరైన రీతిలో వాడకపోతే పెన్సిలిన్ మేలుకంటే ఎక్కువ కీడు చేయగలదు’ అని. ఒక్క పెన్సిలిన్ కే కాదు, అన్ని రకాల యాంటీబయాటిక్స్‌కూ ఈ హెచ్చరిక వర్తిస్తుంది. దాదాపు వందేళ్ల తర్వాత ఆయన చెప్పిన మాట నిజమేనని మన నిర్లక్ష్యం నిరూపించింది.

యాంటీబయాటిక్స్

సరైన రీతిలో వాడటమంటే ఎలా?!

దీన్ని మనం వేర్వేరు అంచెలుగా విభజించి చూడాలి.

1. ఉత్పత్తిదారులు-నియంత్రణ దారులు

2. ఔషధ విక్రయదారులు (మందులషాపు వాళ్లు)

3. వైద్యులు

4. రోగులు

ఈ అన్ని అంచెలూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి.

ఇందులో ముఖ్యమైన అంశాలు రెండు.

ఒకటి ఉత్పత్తి-వినియోగం

రెండు స్వార్థం-నిర్లక్ష్యం.

అదెలానో ఇప్పుడు చూద్దాం.

రోగి/వినియోగదారుడు రోగి చేసే తప్పులు

  • ఒకటి రెండు రోజుల జ్వరానికి కూడా ఓపిక పట్టలేక యాంటీబయాటిక్స్ మొదలుపెట్టడం
  • వ్యాధికి సరైన సమయంలో సరైన డాక్టర్ను సంప్రదించకపోవడం
  • డాక్టరు ఒకరికి సూచించిన మందుల్ని ఎవరికైనా వాడేయడం(పిల్లల్ని కూడా ఉపేక్షించరు కొందరు)
  • ప్రతీ జ్వరానికీ, ప్రతి రోగ లక్షణానికి సొంత వైద్యం చేసుకోవడం
  • కొంచెం ఉపశమనం కలగగానే మందులు ఆపేయడం.
  • సరాసరి మందులషాపునుండి యాంటీబయాటిక్స్ కొని వాడటం.

వైద్యులు-వైద్య విధానం

  • వైద్యం కార్పొరేట్ చేతుల్లోకి పోయాక సగటు మనిషికి డాక్టరు ఓపీ ఫీజు కూడా ఖరీదైపోయింది
  • రోగి-వైద్యుడి బంధం అపనమ్మకం స్థాయికి పడిపోయి, డాక్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు.
  • ఒక్కో ఇన్ఫెక్షన్‌కు, ఒక్కో హాస్పిటల్‌కు నిర్దేశించిన యాంటీబయాటిక్ ప్రోటోకాల్ పాటించకపోవడం
  • రక్తం/మూత్రం నమూనాల కల్చర్ రిపోర్ట్ రాకముందే ఎక్కువ పరిధిగల (broad spectrum) యాంటీబయాటిక్స్ వాడటం.
  • రెండు మూడు రకాల మందులు ఒకేసారి వాడటం
  • వైరల్ ఇన్ఫెక్షన్లలో యాంటీబయాటిక్స్ వాడకం
యాంటీబయాటిక్స్

మందుల విక్రేతలు

  • అతి చొరవతో వీరే కస్టమర్లకు పారాసిటమాల్ ఇచ్చినంత సులువుగా ఒకటి రెండు యాంటిబయాటిక్ బిళ్లలు చేతిలో పెట్టేయడం
  • మందుల కొనుగోలే పరమావధిగా మారడం
  • డాక్టరు చిట్టీ లేకుండా యాంటీ బయాటిక్స్ ఇవ్వడం

ఔషధ నియంత్రణ వ్యవస్థ

అసలు నిఘా నియంత్రణ వ్యవస్థ సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయి. చట్టాలూ నింబంధనలూ మరింత పటిష్ఠంగా ఉండాలి. నాయకుల నిబద్ధత పెరగాలి.

ఇది జరగాలంటే తిరిగి ప్రజల ప్రశ్నించే గుణం పెరగాలి. అందుకే ఈ వ్యవస్థలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి.

యాంటీబయాటిక్స్‌తో తస్మాత్ జాగ్రత్త.. అవి ప్రాణం పోయగలవు...తీయగలవు కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Are we using antibiotics arbitrarily? Why do these things lead to death?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X