Chennai Airport- భారీవర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల రాక నిలిపివేత-6 గంటల వరకూ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతోంది. దీంతో ప్రభుత్వం చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టే పరిస్ధితు కూడా లేకుండో పోతోంది.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో చెన్నై వణికిపోతోంది. ఇప్పటికే వర్షాలకు అక్కడ 14 మంది చనిపోయారు. దీంతో స్ధానిక చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకల్ని నిలిపేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు వచ్చే విమానాల్ని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ నిలిపేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉఁచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

చెన్నై ఎయిర్ పోర్టుకు రావాల్సిన విమానాలను రద్దు చేస్తున్నప్పటికీ, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలను మాత్రం అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తేలడంతో ఆ తర్వాత విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో అప్పటికే ఫ్లైట్లు బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే చెన్నై నుంచి ఫ్లైట్లు టేకాఫ్ అవుతుండటం మాత్రం ప్రయాణికులకు ఊరటనిస్తోంది.
ప్రస్తుతం చెన్నై ఎయిర్ పోర్టులో గంటకు 45 కిలోమీటర్లకు పైగానే గాలులు వీస్తున్నాయి. వీటితో విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చెన్నైలో వర్షాల కారణంగా జనం మృత్యువాత పడుతుండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే భారీ వర్షాల్లోనూ ఎక్కడికక్కడ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు, సూచనల్ని పాటించాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది కురవాల్సిన వర్షం కంటే 50 శాతం అధికంగా వర్షం కురవడంతో పలు జిల్లాలు జలమయం అయ్యాయి.












Click it and Unblock the Notifications