ఆర్టికల్ 370: మోడీకి '50కోట్ల గర్ల్‌ఫ్రెండ్' సునంద సపోర్ట్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రాజ్యాంగ అధికరంపై బిజెపి ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ నుండి మద్దతు లభించింది. పోయిన ఏడాది శశి థరూర్‌కు రూ.50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అంటూ మోడీ.. సునందను ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆర్టికల్ 370 అంశంలో మాత్రం మోడీకి సునంద నుండి మద్దతు లభించింది.
ఆర్టికల్ 370 పైన పునరాలోచన చేయాలని ఆమె అన్నారు. ఈ ఆర్టికల్ వల్ల కాశ్మీరి పండిట్స్, ముస్లిం యువతులు నష్ట పోతున్నారని, తాను కూడా నష్టపోయానని ఆమె తెలిపారు. తన వ్యాఖ్యలు తన భర్త (శశి కపూర్‌కు) అసంతృప్తిని కలిగించేవే అయినప్పటికీ తాను కాశ్మీరి యువతినని, కాశ్మీరి యువతిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తన భర్త జవహర్ లాల్ నెహ్రూకు మంచి అభిమాని అని, తన భర్తను అర్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానన్నారు. ఈ ఆర్టికల్ ఎప్పుడు వచ్చింది తనకు తెలియదన్నారు.

మరోవైపు ఆర్టికల్ 370 పైన మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపి, సిపిఐ పరస్పరం తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నాయి. 370 అధికరణపై చర్చ జరగాలని మోడీ చేసిన ప్రతిపాదనను బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా సమర్థించారు. 370 అధికరణ అన్నది చర్చకు కూడా ఆస్కారం ఇవ్వనంత పవిత్ర పుస్తకం ఏమే కాదని బిజెపి వ్యాఖ్యానించింది. అయితే రాజకీయ లబ్ధికోసమే బిజెపి ఈ వాదన లేవనెత్తిందని కాంగ్రెస్, సిపిఐ విరుచుకుపడ్డాయి.
370 అధికరణపై చర్చ జరపడానికి ఎంతమాత్రం అవకాశం లేదని, ఈ వ్యవహారం శాశ్వతంగా పరిష్కారం అయిపోయిందని సిపిఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా స్పష్టం చేశారు. ఒకవేళ దీనిపై చర్చకు ఎవరైన పట్టుబడితే దానివల్ల మత ఉద్రిక్తతలు రగులుకుంటాయే తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవని ఆయన అన్నారు. 1947 నుంచి కొనసాగుతూ వస్తున్న ఓ అంశంపై బిజెపి అనవసరమైన రాద్ధాంతాన్ని సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు.
ఏ ప్రజల కోసమైతే ఈ అధికరణాన్ని తీసుకొచ్చారో దానివల్ల వారికి ఏ రకపైన ప్రయోజనం జరగలేదని అందుకే దీనిపై అర్థవంతమైన చర్చజరగాల్సి ఉందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఓ పక్క లౌకికవాదం గురించి రాత్రింబవళ్లు మాట్లాడుతున్న నాయకులు ఈ అధికరణ వల్ల జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో పట్టించుకోవడం లేదని బిజెపి అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.
జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపతిపై మోడీ చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత, కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. మోడీ పదిసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టినా దాన్ని రద్దుచేయలేరని ఫరూక్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి భారత్, పాకిస్తాన్ మాజీ సైనిక అధికారుల సమావేశానికి హాజరైన ఆయన మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మోడీ పదిసార్లు ప్రధాన మంత్రి పదవిని చేపట్టినా 370 అధికరణాన్ని రద్దుచేయలేరంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఫరూక్ అబ్దుల్లా ఏ రాజ్యాంగం చదివి మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, నిజానికి 370 అధికరణాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగంలో అవకాశం ఉందని దానికి పార్లమెంటు ఆమోదం కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. దీన్ని రద్దు చేస్తూ రాష్టప్రతి ఓ నోటిఫికేషన్ జారీచేస్తే సరిపోతుందన్నారు. కాగా, 370 ఆర్టికల్ పైన చర్చ జరగడం శుభ పరిణామమని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications