నాటి ఎమర్జెన్సీ కంటే వరస్ట్..: మోదీ-షాలకు అడ్డదారుల్లో గెలిచారనే భయం: కేజ్రీవాల్
ఢిల్లీలో కాక్రోచ్ జనత పార్టీ ప్రదర్శనను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భద్రతా ఆంక్షలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇందిరాగాంధీ హయాం నాటి అత్యవసర పరిస్థితుల కంటే కూడా అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో దేశంలో పూర్తి స్థాయిలో నియంతృత్వ పాలన సాగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సెంట్రల్ ఢిల్లీ పరిధిలో రవాణా ఆంక్షలు విధించడం, నిరసనలో పాల్గొనడానికి వస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర ప్రజా సంఘాల నాయకులను విమానాల్లోనే అరెస్ట్ చేయడం, పలువురిని గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ అరెస్టులన్నీ ఒక ఎత్తయితే.. అరెస్ట్ చేసిన విధానం మరో ఎత్తుగా ఉందని, ఇది దిగ్భ్రాంతికి గురిచేసిందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను ఇలా అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ భయానికి స్పష్టమైన నిదర్శనంగా అభివర్ణించారు.

ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి, అడ్డదారుల్లో గెలిచారనే నిజం బయటపడుతుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక రాజ్యాంగ హక్కులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఓట్ల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ మరోసారి డిమాండ్ చేశారు.
రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా వ్యవహరించడం, ఓటర్ల నమ్మకాన్ని కాపాడటంలో కేంద్ర ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమంలో యువత, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావలసిందిగా కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
This is worse than the Emergency.It’s official.. we are living under an absolute dictatorship ruled by Modi. Arresting cockroaches straight off their flight shows an unprecedented level of fear.PM Modi clearly knows he only won the election through vote chori and now he is hell-bent on protecting his fraud by completely crushing democracy.Gyanesh must go, but so must Modi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 10, 2026
ఈ నిరసన ప్రదర్శనను అడ్డుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ నివాసాన్ని కూడా చుట్టుముట్టారు. భద్రతా బలగాలను మోహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలెవరూ కూడా జంతర్ మంతర్ వైపు ఎవరూ వెళ్లకుండా ప్రధాన రహదారులను మూసివేశారు. దీన్ని తప్పుబట్టారు కేజ్రీవాల్. తన నివాసాన్ని ఒక కోటలా మార్చేశారని, ఇలాంటి ఆంక్షలకు లొంగేది లేదని, అన్ని ఆటంకాలను దాటుకుని తన కుటుంబంతో సహా జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనలో పాల్గొని తీరతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
