మోడీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న, సంబరపడిన జుకర్ బర్గ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మండిపడ్డారు. భారత్ లో పెట్టుబడులు పెట్టండి... అంటూ దేశ ప్రధాని ఒక్కో కంపెనీకి వెళ్లడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.
ప్రధాని మోడీ విదేశీ పర్యటనల వల్ల దేశం ఏం సాధించిందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై ఆయన ట్విట్టర్ ద్వారా విరుచుకు పడ్డారు. మేక్ ఇన్ ఇండియా కంటే ముందు మేక్ ఇండియా చేయాలన్నారు. దేశంలో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు పెంచాలన్నారు.
చైనా తొలుత స్వదేశాన్ని తీర్చిదిద్ది, ఆ తర్వాత విదేశీ పెట్టుబడుల కోసం ఆసక్తి చూపిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తితే వారి విధానాలు మన మీద రుద్దే అవకాశం ఉందన్నారు. ముందు దేశాన్ని చక్కదిద్దితే, ఆ తర్వాత విదేశీ పెట్టుబడులు వాటంతట అవే వస్తాయన్నారు.
మోడీ ఐర్లాండ్, అమెరికా దేశాల పర్యటన ముగించుకుని మంగళవారం నాడు తిరుగు ప్రయాణమైన విషయం తెలిసిందే.

జుకర్ బర్గ్ మనసు కదిలించిన మోడీ
ప్రధాని మోడీ, తాను తమ చిన్ననాటి సంగతులను నెమరువేసుకోవడం ఎంతో ముచ్చటగా అనిపించిందని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నేను, మోడీ మా కుటుంబాల గురించి మాట్లాడుకున్నామన్నారు.
చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకున్నామన్నారు. మోడీ తన తల్లి గొప్పదనం, ఆమె పడిన కష్టం గురించి ఎంతో ఉద్వేగంగా వివరించారన్నారు. మనసునుకదిలించే వివరణ అన్నారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. దీనిని జుకర్ బర్గ్ ఫేస్ బుక్ అప్ డేట్స్‌లో రాసుకున్నారు.












Click it and Unblock the Notifications