కేంద్రం బిగ్ ప్లాన్..! అరెస్టైన మంత్రుల్ని తప్పించే బిల్లు వెనుక ఆ ఇద్దరు ?
క్రిమినల్ కేసుల్లో ప్రధాని, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు అరెస్టు అయి జైలుకు వెళ్లినప్పుడు 30 రోజులు అక్కడే ఉంటే వారు ఆటోమేటిగ్గా పదవులు కోల్పోయేలా చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో ఈ బిల్లును మరింత లోతైన పరిశీలన కోసం కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. అయితే అసలు ఈ బిల్లు వెనుక ఏముందనే అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కారణాలను వెల్లడించాయి.
అరెస్టు అయి జైలుకు వెళ్లిన కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు నెల రోజులు అక్కడే ఉంటే వారు ఆటోమేటిగ్గా పదవులు కోల్పోయేలా చేసే బిల్లును కేంద్రం తీసుకురావడం వెనుక రెండు కీలక ఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. అవే అరవింద్ కేజ్రివాల్, సెంథిల్ బాలాజీ ఘటనలు. ఆప్ అధినేత కేజ్రివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. అలాగే తమిళనాడు డీఎంకే మంత్రి మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు. అయినా వీరు తమ పదవులను వదులుకోలేదు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రివాల్ తన సీఎం పదవిని వదులుకునేందుకు ఇష్టపడలేదు. అలాగే మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ కూడా తన పదవి వదులుకోలేద. దీంతో వీరిద్దరూ జైల్లో ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రిగా కొనసాగారు. ఇలా అరెస్టు అయి నెల రోజుల కంటే ఎక్కువగా జైల్లో ఉన్నప్పటికీ వీరు పదవులు వదులుకోకపోవడం, కేంద్రం కూడా వీరిని తప్పించే అవకాశం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్ధితి ఎదురైంది.

దీంతో మరోసారి ఇలాంటి పరిస్ధితులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఇలా అరెస్టు అయి నెల రోజులు జైల్లో ఉన్న మంత్రులు పదవులు కోల్పోయేలా బిల్లును తీసుకొచ్చింది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఏదైనా కేసులో అరెస్టు తర్వాత దోషులుగా నిర్ధారణ కావడానికి చాలా సమయం పడుతోంది. కేజ్రివాల్, సెంథిల్ బాలాజీ సైతం ఇప్పటికీ దోషులుగా నిర్ధారణ కాలేదు. దీంతో దోషులుగా నిర్ధారణ కాకపోయినా అరెస్టు అయి నెల రోజులకు పైగా జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా కేంద్రం బిల్లు తెచ్చింది. దీంతో కేంద్రం ఈ చట్టం సాయంతో రేపు దర్యాప్తు సంస్థలతో అరెస్టులు చేయించి బెయిల్ రాకుండా జైల్లో ఉంచగలిగితే వారు పదవులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.












Click it and Unblock the Notifications