క్లైమాక్స్: తమిళనాడులో త్వరలో ఎన్నికలు, మేం రెడీ, ఎందుకంటే ? స్టాలిన్
చెన్నై: తమిళనాడులో అతి త్వరలో శాసన సభ ఎన్నికలు వస్తాయని, నాయకులు అందరూ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ పిలుపునిచ్చారు.
బుధవారం ఆయన చెన్నైలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై అందరితో చర్చించారు. అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇరు వర్గాల్లో ఎవ్వరూ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని అంచనాకు వచ్చారు.
ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటూ స్టాలిన్ పార్టీ సీనియర్ నాయకులతో క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం స్టాలిన్ డీఎంకే పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తమిళనాడు శాసన సభ ఎన్నికలు త్వరలోనే వస్తాయని ఎంకే. స్టాలిన్ జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే తరువాత అత్యంత మెజారిటీ శాసన సభ్యులు మన పార్టీ నుంచి గెలుపోందారని స్టాలిన్ గుర్తు చేశారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ చీలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం కష్టంగా మారిందని అన్నారు.
ఇలాంటి సమయంలో శాసన సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని సూచించారు. అన్నీ ఆలోచించే స్టాలిన్ మాట్లాడారని, ఇక అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండటం కష్టం అని, త్వరలో మనమే అధికారంలోకి వస్తామని డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications