సైఫ్‌ను పొడిచింది..అతనే: పొరుగు దేశం నుంచి ముంబైకి: షాకింగ్ రిపోర్ట్
Saif Ali Khan: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై చోటు చేసుకున్న దాడి కేసును ముంబై పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ముంబై జోన్ 9 డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీక్షిత గెడం వెల్లడించారు.
ఈ నెల 16వ తేదీన తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఈ దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఆరుసార్లు పొడిచాడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు చోట్ల సర్జరీ చేశారు డాక్టర్లు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్‌లో భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి నివసిస్తోన్నారు సైఫ్ అలీ. హై- సెక్యూరిటీ జోన్‌గా పరిగణిస్తుంటారీ ప్రాంతాన్ని. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది. అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు.
అడ్డుకోవడానికి ప్రయత్నించిన సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడి పారిపోయాడు. దాడిలో రక్తమోడే స్థితిలో పడిన సైఫ్‌ను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మటిక్ సర్జన్ లీలా జైన్, అనస్థీషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందించారు.
నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ తెల్లవారు జామున అతన్ని ముంబైకి తీసుకొచ్చారు. ఖార్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు బంగ్లాదేశీయుడని డీసీపీ దీక్షిత్ గెడం వెల్లడించారు. అతని పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్. అతనికి 30 సంవత్సరాలు. దోపిడికి పాల్పడాలనే ఉద్దేశంతోనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు.
మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని, ఆ విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని డీసీపీ తెలిపారు. అయిదారు నెలల కిందట ముంబైకి వచ్చాడని, ఇక్కడే మకాం వేశాడనీ పేర్కొన్నారు. తొలుత ముంబై, ఆ తరువాత ముంబై శివారు ప్రాంతాల్లో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో చేరాడని వివరించారు.
నిందితుడు బంగ్లాదేశీయుడని నిర్ధారించడానికి అవసరమైన ప్రాథమిక సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని డీసీపీ దీక్షిత్ చెప్పారు. అతను భారతీయుడేననడానికి సరైన ధృవీకరణ పత్రాలు లేవని, బంగ్లాదేశ్ జాతీయుడని నిరూపించే డాక్యుమెంట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications