మహా కుంభమేళాకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి: హిందూ పండగలే టార్గెట్
Mahakumbh 2025: అసమాన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక భారత్. ఈ గడ్డపై శతాబ్దాలుగా జరుపుకునే హిందూ పండుగలు, మతపరమైన కార్యక్రమాలకు క్రమంగా విఘాతం కలిగించే అంశాలు చోటు చేసుకుంటూ వస్తోండటం ఆందోళనకు గురి చేస్తోంది. మహా కుంభమేళాకు వెళ్లాల్సిన తపతి-గంగా ఎక్స్‌ప్రెస్‌పై ఈ నెల 12వ తేదీన చోటు చేసుకున్న రాళ్ల దాడి దీనికి తాజా ఉదాహరణ.
మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో సంభవించిన ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఇది ఉద్దేశపూరకంగా జరిగిన దాడేననే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. హిందూ పండగలు, ఉత్సవాలు, వేడుకలకు వ్యతిరేకంగా పెరుగుతున్న విష సంస్కృతికి ఇది అద్దం పట్టినట్టయింది. దేశంలో పెరుగుతున్న అసహనం, అసాంఘిక వాతావరణం కలవరపాటు గురి చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

మహా కుంభమేళాకు వెళ్లే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఈ రాళ్ల దాడి సాగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించేలా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకునేలా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభమేళాకు వెళ్తోన్న యాత్రికులను భయభ్రాంతులకు గురి చేయడం నివ్వెర పరుస్తోంది.
దీనికి సంబంధించిన ఓ వైరల్ వీడియో బాధిత ప్రయాణికుల ఆందోళనను ప్రతిబింబించింది. ఈ దాడితో తాము ఎంతగా కలత చెందామనే విషయాన్ని వాళ్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. మహా కుంభ మేళాకు భక్తులను తీసుకు వెళ్లే రైళ్లకు ప్రత్యేకంగా భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకున్నారు.
Multiple coaches were attacked.. Passengers are claiming that it was a targeted attack because the train was going to Mahakumbh.. https://t.co/FEMTBkOqL6 pic.twitter.com/Zqe6Mavi7x
— Mr Sinha (@MrSinha_) January 12, 2025
మహా కుంభమేళాలో పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులను తీసుకెళ్తోన్న మొదటి రైలు ఇదే. తమపై అకస్మాత్తుగా రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. గాజు ముక్కలు మాపై పడ్డాయి. తక్షణమే గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి.. ఈ వీడియో ద్వారా ఓ బాధితుడు చెప్పారు.
ఇదొక్కటే కాదు- 2024లో అయోధ్య, ఇతర ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లపైనా దాడులు జరిగాయి. అసాంఘిక శక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. రైల్వే లైన్ల సమీపంలో అక్రమంగా నివాసాలు ఏర్పరుచుకున్న ప్రాంతాల్లో ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
తాజాగా మహా కుంభ మేళా భక్తులపై జరిగిన ఈ దాడి 2002 నాటి గోద్రా రైలు ఉదంతాన్ని గుర్తు చేసినట్టయింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న 59 మంది కరసేవకులు అప్పట్లో హత్యకు గురయ్యారు. ఇలాంటి దాడులు హిందూ మతపరమైన సమావేశాలు, సదస్సులు, మహా సభలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని, హిందూ సాంస్కృతిక వైభవానికి భంగం కలిగించేవిగా భావిస్తోన్నారు.
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దుర్గాపూజ వంటి నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా జరిగే మతపరమైన ఊరేగింపులపై రాళ్ల దాడులు జరిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అవి మొదలుకుని హర్యానాలోని నూహ్ జిల్లాలో బ్రిజ్‌మండల్ యాత్రలో ప్రేరేపిత మతపరమైన హింస వరకు కొనసాగుతూనే వస్తోన్నాయి.

2024 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో హిందూ మతపరమైన ఊరేగింపులో పాల్గొన్నందుకు 22 ఏళ్ల యువకుడొకడు దారుణంగా హత్యకు గురయ్యాడు. దుండగులు అతణ్ని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఇలాంటి సంఘటనలు పెరుగుతోండటం- రాజకీయ, పరిపాలనాపరమైన వైఫల్యాలను వేలెత్తి చూపుతోంది.
హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎదుర్కొంటోండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో 2022లో మొహర్రం ఊరేగింపులతో సమానం కాకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనాలను పరిమితం చేసింది.
రైల్వే లైన్ల వెంబడి అక్రమంగా వెలిసిన నివాసాలు, నిర్దుష్ట సామాజిక వర్గాల ఆధిపత్యం అనేది.. ఈ ఆందోళనకు కారణమౌతోందనే విమర్శలు ఉన్నాయి. ఆయా దురాక్రమణలు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయనే వాదనలు సైతం వ్యక్తమౌతోన్నాయి.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి తక్షణమే రైల్వే లైన్ల వెంబడి ఆక్రమణలను తొలగించడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అయింది. ఆధ్యాత్మిక ఐక్యత, జాతీయ వాతానికి నిలువెత్తు చిహ్నంగా భావించే మహా కుంభ మేళా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తోండగా.. అక్కడికి వెళ్లే యాత్రికులపై దాడులు జరగడం అనేది ఉలికిపాటుగా మారింది.












Click it and Unblock the Notifications