అటెన్షన్ బెంగళూరు: ఛార్జీలు డబుల్ షాక్
కర్ణాటక ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత మోగించింది. ఇప్పుడు వసూలు చేస్తోన్న ప్రాపర్జీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను రెట్టింపు చేసింది. పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆదివారం నుంచి.. అంటే ఈ నెల 31వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో ఒక శాతం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులో ఉన్నాయి.
వీటిని డబుల్ చేసింది ప్రభుత్వం. ఒకటి నుంచి రెండు శాతానికి పెంచింది. రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవడంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం, 2025-26 మొదటి త్రైమాసికంలో కర్ణాటక ప్రభుత్వం రెవెన్యూ లోటును ఎదుర్కొంది. 2024-25లో ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా 26,000 కోట్ల రూపాయలను లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి వచ్చిన ఆదాయం రూ. 22,500 కోట్లు మాత్రమే.

ఈ ఏడాది కూడా ఈ లోటు కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్- మే- జూన్ కాలానికి ముగిసిన మొదటిత్రైమాసికంలో 28,000 కోట్ల వార్షిక లక్ష్యానికి 35 శాతం లోటు కనిపించింది తొలి త్రైమాసికంలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఆర్థిక లక్ష్యాలను అందుకోలేమనే ఉద్దేశంతో.. ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలను రెట్టింపు చేసింది. ఈ పెంపు నేపథ్యంలో ఈ నెల 31.. ఆదివారం నుండి ఏ ఆస్తి లావాదేవీకైనా చెల్లించాల్సిన మొత్తం రుసుము 7.6 శాతానికి చేరుకుంటుంది.
ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ- 5, రిజిస్ట్రేషన్ ఫీజు- 1, సెస్- 0.5, సర్ ఛార్జీ- 0.01 శాతం కలిపి మొత్తంగా 6.6 శాతం మొత్తాన్ని ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇది 7.6 శాతానికి పెరిగింది. దీంతో పాటు జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 1 నుండి 2 శాతానికి రెట్టింపు అయింది. సాధారణంగా ఇవి పెద్ద భూ కమతాలకు సంబంధించినవి కావడంతో దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయంగా ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక ఇప్పటికీ 6 శాతం కంటే తక్కువ స్టాంపు డ్యూటీని విధించే కొన్ని రాష్ట్రాలలో ఒకటిగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications