Ayodhya Airport: అయోధ్యలో కొత్త ఎయిర్ పోర్ట్ ట్రయల్ రన్ సక్సెస్-రామాలయం ప్రారంభ వేళ..
అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో కొత్త రైల్వేస్టేషన్, కొత్త ఎయిర్ పోర్ట్ కూడా తయారవుతున్నాయి. ఇప్పటికే అయోధ్యలో కొత్త రైల్వే స్టేషన్ తో పాటు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు పనులూ దాదాపు పూర్తి కావడంతో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా నిర్వహించిన విమానాల ట్రయల్ రన్స్ విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ విమానాన్ని ఇందులో ట్రయల్ రన్ కు వినియోగించారు.రెండు దశల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. అయోధ్య విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్ పోర్ట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంఛార్జి రాజీవ్ కులశ్రేష్ఠ ప్రకటించారు.

ట్రయల్ రన్ నిర్వహించిన విమానంలో పౌర విమానయాన శాఖ అధికారులు, డివిజనల్ కమీషనర్ గౌరవ్ దయాల్ సహా అయోధ్య నగరానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. అయోధ్య విమానాశ్రయం తొలిదశలో 2200 చదరపు మీటర్ల రన్ వే, 65 వేల చదరపు అడుగుల టెర్మినల్ భవనం, బోయింగ్ 737, ఎయిర్‌బస్ 319, 320 మరియు చిన్న విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంది. అలాగే గంటకు రెండు-మూడు విమానాలు రాకపోకలు సాగించేలా నిర్మించారు.
అలాగే రెండవ దశలో రన్‌వే 3700 మీటర్లుగా నిర్మించారు. దీంతో పాటు 5 లక్షల చదరపు అడుగుల టెర్మినల్ భవనం,బోయింగ్ 787- 777 (అంతర్జాతీయ విమానాలు) రాకపోకలు సాగించేలా నిర్మించారు. ఈ నెల 30న ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అయోధ్యకు చేరుకుని ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం వేళ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications