బతికుండానే తన 'పెద్ద కర్మ' తానే నిర్వహించుకున్న వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!
సాధారణంగా ఎవరైనా చనిపోతే.. మృతుడి కుటుంబ సభ్యులు 13 వ రోజున పెద్ద కర్మ నిర్వహిస్తుంటారు. బంధువులను పిలిచి భోజనాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం తాను బతికుండగానే పెద్ద కర్మ నిర్వహించాడు. తన పెద్ద కర్మను తానే నిర్వహించుకుని దాదాపు 900 మందికి భోజనాలు పెట్టాడు. అలాగే ఈ కార్యక్రమంలో తన 10 ఏళ్ల మనవడికి తలపాగా చుట్టి కుటుంబ భవిష్యత్తును ఆ బాలుడికి అప్పగించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లాలో జరిగింది. మరి ఆయన ఇలా ఎందుకు చేశాడు..?
ఉత్తర్ ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా భరౌట్ మండలం జోహ్రీ గ్రామానికి చెందిన భల్జోర్ సింగ్ వయసు 80 ఏళ్లు. ఆయన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారారు. అందుకు కారణం.. తన పెద్ద కర్మను తానే నిర్వహించుకోవడమే.. సాధారణంగా మృతుడి లేదా మృతురాలి కుమారుడు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తుంటాడు. అయితే భల్జోర్ సింగ్ కు కుమారులు లేరు. ఒకటే కూతురు. దాంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోయాక ఈ కార్యక్రమాల్లో తన కూతురు ఇబ్బంది పడొద్దని ఇలా ఆలోచించినట్లు భల్జోర్ సింగ్ తెలిపాడు.
"నాకు కుమారులు లేరు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చనిపోయాక నా కూతురు ఇబ్బంది పడొద్దని నేను బతికుండగానే ఈ కార్యక్రమం చేశాను" అని భల్జోర్ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఈ కార్యక్రమానికి దాదాపు 900 మంది వచ్చి భోజనాలు చేశారు. ఇక స్థానిక సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమంలోనే తన మనవడు ముకుల్(10) కు తలపాగా కట్టి కుటుంబ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నాడు. " నా కుటుంబం ఇక్కడే ఉంది. చుట్టు పక్కల ఊరి నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. నాకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. నా దగ్గర ఉన్న రెండు భిగాల పొలం ఇప్పటికే నా మనవడికి ఇచ్చేశాను" అని భల్జోర్ సింగ్ తెలిపాడు.

ఇక ఈ ఘటనపై భల్జోర్ సింగ్ కుమార్తె పింకీ మాట్లాడుతూ.." మా నాన్న స్వయంగా పెద్ద కర్మ నిర్వహించాడు. అతను బతికుండగానే ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. నేను ఆయన ఒక్కగానొక్క కుమార్తెను. నాకు సోదరులు లేరు. ఆయన ఇలా చేయడం నాకు సంతోషంగా అనిపించింది" అని పింకీ పేర్కొంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ మంత్రి కేపీ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భల్జోర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం తాను ఎక్కడా చూడలేదని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
