ఆర్మీ ఆసుపత్రిలో ఫోటోలు: బంగ్లాదేశీయుడి అరెస్టు
కోల్ కతా: నిషేదిత ప్రాంతంలో ప్రవేశించిన వ్యక్తి అక్కడి దృశ్యాలను మొబైల్ లో ఫోటోలు తీస్తున్న సమయంలో అతనిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ నూర్ ఇస్లామ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని బుధవారం కోల్ కతా పోలీసులు చెప్పారు.
ఇతను బంగ్లాదేశ్ పాస్ పోర్టుతో భారత్ వచ్చాడు. కోల్ కతాలోని కమాండో (ఆర్మీ) ఆసుపత్రిలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రిలో ఇతని పని పూర్తి అయ్యింది.
తరువాత ఇంటికి వెళ్లకుండా మహమ్మద్ నూర్ ఇస్లామ్ అక్కడక్కడే అనుమానాస్పదంగా సంచరించాడు. ఆసుపత్రిలోని నిషేదిత ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సౌకర్యాలు, పరిసర ప్రాంతాలను మొబైల్ లో ఫోటోలు తీశాడు.

కమాండో ఆసుపత్రి సిబ్బంది విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహమ్మద్ నూర్ ఇస్లామ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
ఎందుకు నిషేదిత ప్రాంతంలోకి వెళ్లావు, అక్కడ ఎందుకు ఫోటోలు తీస్తున్నావు అని పోలీసులు ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులతో మహమ్మద్ నూర్ ఇస్లామ్ కు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications