బాలుడిగా మోడీ తండ్రికి సాయంగా టీ అమ్మారు: టైమ్ మ్యాగజైన్‌లో ఒబామా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేందమోడీపై టైమ్ మ్యాగజైన్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్‌లో మోడీపై ఒబామాకున్న ప్రేమ, ఆప్యాయతను తెలిపేలా ఉంది. ఇందులో మోడీని ఒబామా 'ప్రధాన సంస్కరణకర్త'గా అభివర్ణించారు.
"ఓ బాలుడిగా నరేంద్రమోడీ తనవంతుగా కుటుంబానికి మద్దతిచ్చేందుకు తన తండ్రికి సాయంగా టీ అమ్మారు. ప్రస్తుతం ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. పేదరికం నుంచి ప్రధానిగా సాగుతున్న ఆయన జీవితం భారతదేశ చైతన్యానికి మరియు సంభావ్యతను ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.
"చాలా మందికి సాయం చేయాలన్న ఆయన నిర్ణయం తన దారిలో ఎక్కువ మంది భారతీయులను నడిపించేలా చేస్తుంది. పేదరికాన్ని తగ్గించేందుకు, విద్యను మరింత మెరుగుపరిచేందుకు, మహిళలు, బాలికలను శక్తివంతం చేసేందుకు, నిజమైన భారత ఆర్ధిక సామర్ధ్యాన్ని సాధించేందుకు మోడీ వద్ద విజన్ ఉంది" అని తెలిపారు.

ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేస్తున్న సందర్భంగా ఆ మ్యాగజైన్‌కు ఒబామా 160 పదాల్లో మోడీపై ఆర్టికల్ రాశారు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2014కు సంబంధించి విడుదల చేసిన 'వంద మంది ప్రభావవంతులు' జాబితాలో మన దేశం నుంచి ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు మాత్రమే చోటు లభించింది. మొదటి స్ధానంలో రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ఉన్నారు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ పరేడ్ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఒబామాకు మోడీ ఆత్మీయ స్వాగతం పలికి, అన్నీ దగ్గరుండి మరీ చూసుకోవడంతో వీరిద్ధరి మధ్య స్నేహాపూర్వక బంధం మరింతగా బలపడింది.
ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ 11రోజుల విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలో ఉన్నారు. అంతక ముందు ఫ్రాన్స్, జర్మనీ దేశాలను సందర్శించారు. టైమ్ మ్యాగజైన్‌కు ఒబామా రాసిన లేఖను తెలుసుకున్న ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ఒబామాకు ధన్యవాదాలు తెలిపారు.
Dear @BarackObama your words are touching & inspiring. Thanks @TIME. http://t.co/igmK5moGxn
— Narendra Modi (@narendramodi) April 16, 2015 











Click it and Unblock the Notifications