బంగాళాఖాతంలో ఆవర్తనం దెబ్బ: భారీ వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. దీని ప్రభావం మూడు రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆగ్నేయదిశగా బంగాళాఖాతం ఉపరితలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించివుంది. ఇది మరింత బలపడింది. సముద్రం మీదుగా వీస్తోన్న బలమైన ఈస్టర్లీ విండ్స్ దీనికి తోడయ్యాయి. ఫలితంగా ఆవర్తనం మరింత విస్తరిస్తుందని ఐఎండీ చెబుతోంది.

ఈ ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వరకు ఉండొచ్చు. గంటకు 55 కిలో మీటర్ల వరకకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలో నైరుతి- దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురు గాలులు వీస్తాయి.
దీని ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుదుచ్చేరి, కరైకల్‌ల్లోనూ ఇదే తీవ్రత కనిపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. అదే సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది.
తమిళనాడు ఉత్తర ప్రాంత జల్లాలు తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుథురై, పుదుక్కోట్టైతో పాటు రాణిపేట, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావొచ్చు. అలాగే- రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యకుమారి జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 15వ తేదీ వరకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
దక్షిణ తమిళనాడు తీర ప్రాంతంలో గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలుల తీవ్రత గంటకు 55 కిలో మీటర్లకు పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.












Click it and Unblock the Notifications