ఇకనుంచి ఆఫీసుల్లో బీర్లు, వైన్ తాగొచ్చు.. ప్రభుత్వం కొత్త చట్టం..
హర్యానాలోని కార్యాలయాల్లో బీర్, వైన్ సర్వ్ చేసేలా అనుమతిస్తూ ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రకారం అన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో వైన్, బీరుతోపాటు ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న పానీయాలను సర్వ్ చేసేలా అనుమతిస్తున్నారు. సుమారు 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటిన్ లేదంటే తినుబండారాలుండాలని ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు హర్యానా క్యాబినెట్ కొత్త పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు.

కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటాను కూడా హర్యానా ప్రభుత్వం పెంచింది. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం ధరల్లో నామమాత్రపు పెరుగుదల ఉండబోతోంది. ఈ పెంపుద్వారా ఎక్సైజ్ ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది.
హర్యానా రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును తగ్గించారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల.. సర్కార్ నోటిఫై చేసిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాల్లో మద్యం దుకాణాలకు అనుమతివ్వరు. ఈ మేరకు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం బీర్లు, వైన్లు అంటారని, కాలక్రమేణా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్నవాటిని కూడా తీసుకోవచ్చని చట్టం తెస్తారంటున్నారు. ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయని, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచుకునే మార్గలే కనపడలేదా? అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications