ఛీ, తాటకి మమతకు మళ్లీ గెలుపా? -బెంగాల్ చారిత్రక తప్పిదం -బీజేపీ బాబుల్ సుప్రియో వికృతం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ప్రచారంలో హడావుడి చేసిన బీజేపీని కేవలం 76 స్థానాలకే పరిమితం చేస్తూ టీఎంసీ ఏకంగా 214 స్థానాలను కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడో సారి సీఎంగా ప్రమాణం చేయనున్న మమతా బెనర్జీని ఉద్దేశించి బెంగాల్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ పార్టీ ఘన విజయం సాధించడంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో అనుచిత వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని రాక్షస, క్రూరమైన మహిళగా అభివర్ణిస్తూ, బెంగాల్ ప్రజలు ఒక క్రూరమైన మహిళకు ఓటేశారని, ఇది చారిత్రక తప్పిదమని ఫేస్‌బుక్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబుల్ కామెంట్లపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

''నేను మమతను అభినందించడం గానీ, ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని కానీ చెప్పబోను. నిజంగా చెప్పాలంటే బెంగాల్‌లో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా అవినీతి, అసమర్థ, నీతి తప్పిన ప్రభుత్వాన్ని, ఓ క్రూరమైన మహిళకు ఓటేసి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి బెంగాల్ ప్రజలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటానని బాబుల్ పేర్కొన్నారు.
ఎల్లడలా విమర్శలు రావడంతో బాబుల్ సుప్రియో తన పోస్టును డిలీట్ చేశారు. అయితే, సుప్రియో నోరు పారేసుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు కేంద్ర కేబినెట్ సహచరులంతా మమత విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు మమత సాధించిన ల్యాండ్‌స్లైడ్ విక్టరీకి అభినందనలు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ నలుగురు ఎంపీలను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపింది. టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన సుప్రియో తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications