బీజేపీకి మరో షాక్: పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన నటి శ్రవంతి ఛటర్జీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తిరిగి అధికార టీఎంసీలో చేరగా, పార్టీని వీడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా, మరో నేత బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ నేత ఎవరో కూడా బెంగాళీ నటి శ్రవంతి ఛటర్జీ.
భారతీయ జనతా పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు బెంగాలీ నటి శ్రవంతి(స్రబంతి) ఛటర్జీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 2న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె పార్టీలో చేరి, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

'బెంగాల్‌ను మరింత ముందుకు తీసుకురావడానికి చొరవ, చిత్తశుద్ధి బీజేపీ చూపడం లేదు' అని, అదే తన రాజీనామాకు కారణమని ఛటర్జీ పేర్కొన్నారు. ఆమె బిజెపికి రాజీనామా చేయడంతో ఆమె ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి.
ఈ క్రమంలో. 'దీదీపై మీరు సాఫ్ట్ కార్నర్‌ను కలిగి ఉన్నారా? టీఎంసీలో చేరతారా? అని ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌కి ప్రతిస్పందించారు ఛటర్జీ. ప్రస్తుతం తనను మాట్లాడనివ్వాలని 34 ఏళ్ల నటి కోరారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రచార ర్యాలీల్లో ఆమె బీజేపీ నేతలు కైలాష్ విజయవర్గియా, దిలీప్ ఘోష్‌లతో కలిసి కనిపించారు. శ్రబంతి ఛటర్జీ.. బెహలా వెస్ట్ అసెంబ్లీ స్థాననం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. టీఎంసీ నుంచి పార్థ ఛటర్జీ పోటీ చేశారు. అయితే, శ్రబంతి ఛటర్జీ కేవలం 60,000 ఓట్లను మాత్రమే సాధించి, టీఎంసీ అభ్యర్తిపై ఓటమి పాలయ్యారు.
ఇది ఇలావుండగా, ఇప్పటికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఎంసీ పార్టీలో చేరిపోయారు. సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. పలువురు సీనియర్ నేతలు కూడా బీజేపీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బాటపట్టారు.












Click it and Unblock the Notifications