బెంగళూరు వరప్రదాయిని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మోక్షం
బెంగళూరులోని సిల్క్ బోర్డ్ కారిడార్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. వాహనాల రాకపోకల కోసం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు ఒకట్రెండ్ స్ట్రెచ్చులు మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్ మొత్తంపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. బెంగళూరులో అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్- జయదేవ హాస్పిటల్ ను అనుసంధానించే ఫ్లైఓవర్ ఇది.
ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం కావడం వల్ల ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీని 80 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్‌లోని హెచ్‌ఎస్‌ఆర్ 5వ మెయిన్ నుండి జయనగర్ (రాగిగుడ్డ) వరకు వాహనాలను అనుమతించారు. అనేక సంవత్సరాల జాప్యం తర్వాత నగర ట్రాఫిక్ నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన ఈ మిస్సింగ్ లింక్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ స్ట్రెచ్.. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్, జయనగర్‌లను కలుపుతుంది.

నమ్మ మెట్రో ఎల్లో లైన్ మార్గం కింద ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ర్యాంప్‌లు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తాయి. అన్ని ప్రధాన జంక్షన్ల వద్ద కూడా ర్యాంప్ లు ఉండటం వల్ల ఫ్లైఓవర్ మీదికి రాకపోకలు సాగించడానికి వాహనదారులకు వెసలుబాటు కలిగింది. మొన్నటివరకు ట్రయల్ రన్ చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ట్రాఫిక్ కోసం దీన్ని తెరిచినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
సిల్క్ బోర్డ్-జయదేవ హాస్పిటల్ మార్గం నగరంలో అత్యంత రద్దీ ప్రాంతం. ఇక్కడ పీక్ అవర్స్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతుంటుంది. వాహనాలు ఎక్కడికక్కడ గంటల కొద్దీ ఆగిపోతుండటం సర్వసాధారణం. ఈ ఫ్లైఓవర్.. డైరెక్ట్ ట్రాఫిక్‌ను ఉపరితల రోడ్ల నుండి మళ్లించడం ద్వారా ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పలు రద్దీ జంక్షన్ల మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించినందున ఎక్కడ కూడా వాహనాలకు బ్రేక్ పడదు. బొమ్మనహళ్లి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, మాడివాళ నుండి వచ్చే వాహనాలు గ్రౌండ్ లెవెల్ జంక్షన్‌ను ఉపయోగించుకునే అవకాశం లభించింది.
ఈ ఎలివేటెడ్ రూట్ ప్రారంభం కావడం వల్ల హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్, రాగిగుడ్డ ప్రాంతాల మధ్య నిరంతరాయంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మూడు ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు కొత్త డౌన్ ర్యాంప్ కూడా అందుబాటులోకి వచ్చింది. రద్దీగా ఉండే గ్రౌండ్ లెవెల్ జంక్షన్ నుండి ట్రాఫిక్‌ను మళ్లించడానికి ఉపయోగపడుతోంది.
గతంలో రాగిగుడ్డ-సిల్క్ బోర్డు మార్గంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను పాక్షికంగా ప్రారంభించారు. అది వన్ వే. ఫలితంగా ట్రాఫిక్ కొంతవరకు తగ్గింది. డబుల్ వే ఉన్న భాగం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇప్పుడు 5.5 కిలోమీటర్ల పూర్తి మార్గం పూర్తయింది. వాహనదారుల కోసం దీన్ని తెరవడం వల్ల బీటీఎం లేఅవుట్, రాగిగుడ్డ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ, మడివాళ మధ్య ప్రయాణించే వారికి భారీ ప్రయోజనం చేకూరుతోంది.












Click it and Unblock the Notifications