మెట్రో రైలు పట్టాలపై కూలిన చెట్లు: తప్పిన ముప్పు
Bengaluru rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిలికాన్ సిటీ బెంగళూరులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు నగరంలో ఉన్న చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాన నీటితో కళకళలాడుతున్నాయి. మొన్నటివరకు ఇబ్బందిపెట్టిన నీటి కొరత తీరినట్టయింది.
మే 30వ తేదీ నాడే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. వాటి ప్రభావంతో కర్ణాటక వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలు దక్షిణ కన్నడ, చామరాజనగర, ఉడుపితో పాటు మైసూరు, రామనగర, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

ఆ సాయంత్రం బెంగళూరులో కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ మధ్యాహ్నం నుంచి బెంగళూరు నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. బెల్లందూరు, జేపీ నగర, ఎంజీ రోడ్, జయనగర, ఉల్సూర్, మత్తికెరె, విద్యారణ్యపుర, దొడ్డబొమ్మసంద్ర, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, తవరెకెరెల్లో వర్షం దంచికొట్టింది.

వర్తూరు, పులకేశినగర, గుట్టహళ్లి, మార్థహళ్లి, కొనెన అగ్రహార, హంపీ నగర, విశ్వేశ్వరపుర, హొరమావు, యలహంక, వైట్‌ఫీల్డ్, గొట్టిగెరె, బన్నేరుఘట్ట రోడ్, విజయనగర, రాజాజీనగర, బసవేశ్వర నగర, యశ్వంతపూర్, పీణ్య, లగ్గెరె, నందిని లేఅవుట్, మల్లేశ్వరం, శేషాద్రిపురం, హెబ్బాళ.. వంటి ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచింది.
బలమైన ఈదురుగాలులు వీచడం వల్ల పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఎంజీ రోడ్‌లో చెట్లు మెట్రో రైల్ ట్రాక్‌పై కూలపోయాయి. ఫలితంగా ఈ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. ట్రినిటీ స్టేషన్- ఎంజీ రోడ్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో ఇందిరానగర్- వైట్ ఫీల్డ్, ఎంజీ రోడ్- చల్లఘట్ట మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన చెట్లను తొలగించే పనులు చేపట్టారు.












Click it and Unblock the Notifications