Traffic Updates: 5 కీలక ఫ్లైఓవర్లపై వీరికి నో ఎంట్రీ! సెప్టెంబర్ 4 నుంచి కొత్త రూల్స్
సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ తిప్పలకు చెక్ పెట్టడంతో పాటు రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ఐదు ప్రధాన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లలో కొన్ని నిర్దిష్ట రకాల వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రహదారుల వెడల్పు, వాహనాల వేగంలో తేడాలు, ఎంట్రీ- ఎగ్జిట్ పాయింట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తోంది.
ఈ ఆంక్షలు సెప్టెంబర్ 4 నుంచి నాలుగు ప్రధాన ఫ్లైఓవర్లపై అమల్లోకి రానున్నాయి. మైసూర్ రోడ్డులోని బీజీఎస్ (సిర్సీ సర్కిల్) ఫ్లైఓవర్, పీణ్యా ఫ్లైఓవర్, సిల్క్ బోర్డ్-రాగిగుడ్డ మధ్య ఉన్న మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, అలాగే సంజీవ్‌నగర్ క్రాస్ నుండి విద్యాశిల్ప్ జంక్షన్ వరకు ఉన్న బళ్లారి రోడ్ (ఎయిర్‌పోర్ట్ రోడ్) ఎలివేటెడ్ కారిడార్‌లపై సెప్టెంబర్ 4 నుంచి ఆంక్షలు వర్తిస్తాయి. ఇకపోతే, ఎలక్ట్రానిక్స్ సిటీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మాత్రం సెప్టెంబర్ 11 నుంచి ఈ కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.

ఏ ఫ్లైఓవర్‌పై ఏ వాహనానికి నిషేధం ఉందో చూసుకోండి!
వాహనాల రకాన్ని బట్టి వేర్వేరు సమయాల్లో ఈ నిషేధం వర్తిస్తుంది. మైసూర్ రోడ్ సిర్సీ సర్కిల్ ఫ్లైఓవర్‌పై భారీ సరుకు రవాణా వాహనాలను 24 గంటలూ నిషేధించారు. మిగిలిన గూడ్స్ వాహనాలు, త్రీ-వీలర్ ఆటోలకు ఉదయం 7 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు అనుమతి లేదు. పీణ్యా ఫ్లైఓవర్‌పై ప్యాసింజర్, గూడ్స్ ఆటోలను 24 గంటల పాటు పూర్తిగా నిషేధించారు. మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై భారీ సరుకు వాహనాలకు 24 గంటల నిషేధం అమల్లో ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్ రోడ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ల రద్దీకి చెక్!
ఎయిర్‌పోర్ట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ సిటీ ఎక్స్‌ప్రెస్‌వేలపై టూ వీలర్స్, ప్యాసింజర్ ఆటోలు, త్రీ-వీలర్ గూడ్స్ వాహనాల రాకపోకలను 24 గంటల పాటు పూర్తిగా నిలిపివేస్తున్నారు. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌పై ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు అనుమతి నిరాకరించారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications