Nasal Vaccine: ఇవ్వాళ్టి నుంచే కోవిన్ యాప్‌లో: అర్హతలు, రిజిస్ట్రేషన్ ఇలా..!!
న్యూఢిల్లీ: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన అత్యంత ప్రమాదకరమైన బీఎఫ్ 7 వేరియంట్ ప్రభావం భారత్ పైనా పడింది. ఒడిశాలో ఒకటి, గుజరాత్ లో మూడు పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ఈ వ్యాక్సిన్ బారిన పడిన పేషెంట్లు ప్రస్తుతం ఆసుపత్రులు, కోవిడ్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వారి కంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంది.

విస్తరిస్తోన్న బీఎఫ్ 7
కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పంజాబ్, ఢిల్లీ, బిహార్.. వంటి పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి కూడా. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, ఏసీ బార్ అండ్ రెస్టారెంట్స్ వంటి ఇన్ డోర్ ప్రాంతాల్లో మాస్కులను తప్పనిసరి చేశాయి. మార్కెట్లు.. ఇతర బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను ధరించాలంటూ ఆదేశాలను జారీ చేశాయి. మూడో డోస్, ప్రికాషన్ డోస్ వ్యాక్సిన్‌ను వేసుకోవాలంటూ సూచించాయి.

ఇంకోవ్యాక్..
దీనితో పాటు తాజాగా నాసిల్ వ్యాక్సిన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవ్వాళ్టి నుంచే కోవిన్ యాప్ ద్వారా ఈ ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దీని పేరు ఇంకోవ్యాక్. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. ఈ నాసిల్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. నీడిల్ లెస్ వ్యాక్సిన్ ఇది. కోవిడ్ ను నిరోధించడానికి ఇంకోవ్యాక్ మందును చుక్కల రూపంలో ముక్కు ద్వారా వేస్తారు.

ఇంట్రానాసిల్ తొలిసారి..
భారత్ లో ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ముక్కు ద్వారా వ్యాక్సిన్ వేసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ వేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఆమోదించింది. దీన్ని అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్.. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం సహకారాన్ని తీసుకుంది. బూస్టర్ షాట్ గా దీన్ని ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.

వాటి సరసన..
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ డెవలప్్ చేసిన కోవిషీల్డ్, కోవావాక్స్, రష్యాకు చెందిన స్పుత్నిక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ కు చెందిన కోర్బెవాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ కోవిన్ పోర్టల్ లో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇంకోవ్యాక్ కూడా వాటి సరసన చేరింది. ఇవ్వాళ్టి నుంచే కోవిన్ యాప్ ద్వారా ఈ నాసిల్ వ్యాక్సిన ను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

మరింత కఠినంగా..
ఇప్పుడు తాజాగా- మరిన్ని కఠిన ఆంక్షలను జారీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దేశ ప్రజలందరూ కొత్త ఏడాది వేడుకల్లో మునిగి తేలడానికి సన్నాహాలు చేస్తోన్న ఈ పరిస్థితుల్లో కోవిడ్ కేసులు ముంచుకొస్తోండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఈ సాయంత్రానికి వెలువడించనుంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను విధించడం ఖాయంగా కనిపిస్తోంది. పండగల సీజన్ కు కూడా వర్తింపజేసేలా కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications