పోలిటికల్ సైన్స్ అంటే వంటల సబ్జెక్ట్: బీహార్ బోర్డ్ టాపర్ సమాధానం
పాట్నా: బీహార్‌లోని వైశాలి జిల్లా మరోసారి వార్తల్లోకెక్కింది. బీహార్ బోర్డు టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్ధిని పోలిటికల్ సైన్స్ అంటే వంటలకు సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పడమే ఇందుకు కారణం. పొలిటికల్ సైన్స్ విభాగంలో టాపర్‌గా రూబే రే నిలవగా, సైన్స్ టాపర్‌గా సౌరభ్ శ్రేష్ట నిలిచాడు.
రూబే రే అనే విద్యార్ధినికి 500కు గాను 444 మార్కులు వచ్చాయి. ఇక సైన్స్ టాపర్‌గా నిలిచిన సౌరభ్ శ్రేష్టకు 500కు గాను 485 మార్కులు వచ్చాయి. దీనికి తోడు సైన్స్ విభాగంలో టాపర్‌గా నిలిచిన మరో విద్యార్ధి సౌరభ్ శ్రేష్ట ఎలక్ట్రాన్, ప్రోటాన్ అంటే తెలియదని చెప్పడం గమనార్హం.

అంతేకాదు సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. గత వారం బీహార్ బోర్డు పరీక్షా ఫలితాలను ప్రకటించారు. దీంతో పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన కొంతమంది విద్యార్ధులను ఆజ్ తక్ అనే న్యూస్ ఛానెల్ ఇంటర్యూ చేసింది.
విద్యార్ధుల ఇంటర్యూలు న్యూస్ ఛానెల్ ప్రసారం కావడంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో తెలియక చివరకు ఈ మొత్తం పరీక్షలపై విచారణకు ఆదేశించింది. మీడియాలో ప్రసారమైన ఈ దృశ్యాలపై బీహార్ రాష్ట్ర విద్యాశాక మంత్రి అశోక్ చౌదరి తీవ్రస్థాయిలో స్పందించారు.
హుమనిటిక్స్, సైన్స్, కామర్స్ ఈ మూడు సబ్జెక్టుల్లో టాప్ ర్యాంకులు పొందిన ఐదుగురిని నిపుణుల కమిటీ తిరిగి ప్రశ్నిస్తుందని ఆయన చెప్పారు. దీంతో పాటు ఎగ్జామినర్లు ఈ ఐదుగురికి అత్యధికంగా మార్కులు వేయడానికి గల వాస్తవం ఏమిటో కూడా కమిటీ తెలుసుకుంటుందని చెప్పారు.
దీంతో వీరిద్దరికి తిరిగి జూన్ 3వ తేదీన రివ్యూ ఎగ్జామ్‌ని బోర్డు అధికారులు పెట్టనున్నారు. పరీక్షల ఫలితాలను సక్రమంగా విడుదల చేయడంలో బోర్డు అలసత్వం ప్రదర్శిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఆజ్ తక్ న్యూస్ ఛానెల్ ప్రశ్నించిన ఈ ఇద్దురు టాపర్లు కూడా బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలోని భగవాన్‌పూర్‌లో బిషున్ రాయ్ కాలేజికి చెందిన వారు కావడం గమనార్హం.
గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల సందర్భంలో ఈ కాలేజీ వార్తల్లో నిలిచింది. ఈ కాలేజీలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కాలేజీ గోడలు ఎక్కి మరీ కాపీలను అందించడం మనం చూశాం.
దీంతో ఆ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో ఆ కాలేజి ఫలితాలను అప్పటి విద్యా శాఖ మంత్రి పికె షాహి నిలిపి వేశారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలోనే టాపర్లుగా నిలిచిన వారి తెలివితేటలు ఇలా ఉంటే మిగతా లక్షలాది మంది విద్యార్థుల స్థాయి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.












Click it and Unblock the Notifications