ప్రశాంత్ కిషోర్ కు కష్టకాలం..! గెలిపించిన పార్టీల్నే ఓడించలేక అవస్ధలు..!
ప్రశాంత్ కిషోర్ అంటే ఠక్కున్న గుర్తొచ్చేవి రాజకీయ పార్టీలకు ఆయన ఇచ్చే వ్యూహాలు. ఎన్నికల్లో విజయాలు. పార్టీలతో సంబంధం లేకుండా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆయన రచించిన వ్యూహాలు. ఒకప్పుడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలు వైసీపీ, శివసేన, డీఎంకే, టీఎంసీ వంటి ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించి వారిని అధికార పీఠాలు ఎక్కించిన చరిత్ర ఉన్న ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది.
గత కొన్నేళ్లుగా రాజకీయ వ్యూహాలకు దూరంగా ఉంటూ స్వరాష్ట్రం బీహార్ లో జన్ సురాజ్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకుని అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పెను సవాల్ గా మారాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఆయన వ్యూహాలతో అధికార పీఠాలు ఎక్కిన కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీల నుంచే ఆయనకు ఈ సవాల్ ఎదురవుతోంది. దీంతో రాజకీయ వ్యూహకర్త కాస్తా ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓవైపు అధికార బీజేపీ-జేడీయూ కూటమి, మరోవైపు కాంగ్రెస్-ఆర్జేడీతో కూడిన ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మధ్యలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ అభియాన్ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే సాధారణ పరిస్ధితుల్లో అయితే పీకే వ్యూహాలు పనిచేసి ఆయన గణనీయమైన స్ధానాలు దక్కించుకునేవారు ఏమో కానీ ఇప్పుడు రెండు కూటముల మధ్య జరుగుతున్న పోరులో మాత్రం పీకే నలిగిపోతున్నారు.

ముఖ్యంగా జన్ సురాజ్ పార్టీతో పోలిస్తే ఎన్నో రెట్లు అంగబలం, అర్ధబలం కలిగిన రెండు కూటముల్లోని పార్టీలు ఇప్పుడు అన్ని విధాలా ప్రశాంత్ కిషోర్ కు సవాల్ గా మారాయి. వీటిని ఎదుర్కోలేక ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నోటికి పని చెప్తున్నారు. రాహుల్ గాంధీని బయటి వ్యక్తి అని, మోడీ హిందూత్వ సిద్ధాంతం బలం కోల్పోతోందని ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ వివాదం నడుస్తూనే ఉంది. దీన్ని కూడా అందిపుచ్చుకునే పరిస్ధితుల్లో పీకే లేరు. దీంతో ఈసారి పీకే పార్టీ కనీస సీట్లు సాధించి పరువు దక్కించుకుంటే చాలనుకుంటోంది.












Click it and Unblock the Notifications