లాలూ, కాంగ్రెస్‌కు షాక్: బలపరీక్ష నెగ్గిన నితీష్, బీహార్‌లో బీజేపీ-జేడీయూ సర్కారు
పాట్నా: బీహార్ అసెంబ్లీలో శుక్రవారం నిర్వహించిన బలనిరూపణ పరీక్షలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయం సాధించారు. నితీష్‌కు అనుకూలంగా 131మంది ఎమ్మెల్యేలు ఓట్లేయగా, వ్యతిరేకంగా 108మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మేజిక్ ఫిగర్ 122 కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి.
బీజేపీ-జేడీయూ నుంచి 129 ఓట్లు రాగా, నితీష్‌కు మద్దతుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేయడంతో ఆయన మద్దతు 131కి చేరింది. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడుతోందని చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వం కోసమే మేము ప్రయత్నిస్తామని, ఆ విషయాన్ని ఆర్జేడీ మరిచిందని ఆరోపించారు.

లౌకికవాదం అవినీతిని సమర్థించదని, తప్పుడు మార్గం ద్వారా డబ్బు ఆర్జించే వారికి ప్రజలు, ప్రభుత్వం ఎన్నటికీ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ తేజస్వీ యాదవ్ రాజీనామా చేసిన పక్షంలో తాను ఇక్కడ ఉండే వాడిని కాదని ఆయన అన్నారు.
కాగా, ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ దాదాపు 40 నిమిషాల పాటు అసెంబ్లీలో ప్రసంగించారు. 'మీకు సిగ్గుగా లేదా? నితీశ్, బీజేపీ అవకాశవాదులు, రాజకీయ కుట్రకు పాల్పడ్డారు' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ 24గంటల్లోనే బీజేపీ మద్దతుతో తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications