దీపావళి తర్వాతే నితీశ్ ప్రమాణం -పోటీ చేయకుడానే ఏడోసారి సీఎం
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆధిక్యం లభించడం, జేడీయూకు తక్కువ సీట్లొచ్చినా, సంకీర్ణ ధర్మం ప్రకారం నితీశ్ నే ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రకటించడంతో ఆయనే పదిలో కొనసాగనున్నారు. అయితే.. దీపావళి తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్యసభ ఎంపీ, జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి బుధవారం మీడియాకు చెప్పారు.
బుధవారం ఉదయానికి పూర్తిస్థాయిలో వెల్లడైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి 125 స్థానాలు, మహాకూటమికి 110, ఎంఐఎం 5, ఎస్పీ 1, ఎల్జేపీ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందడం తెలిసిందే. ఫలితాల్లో బీజేపీ 74 సీట్లు సాధించి ఎన్డీఏలో సీనియర్ గా నిలవగా, 43 సీట్లతో జేడీయూ జూనియర్ గా మారిపోయింది. అయితే నంబర్ తో సంబంధం లేకుండా నితీశ్ నే నాయకుడిగా కొనసాగిస్తామని బీజేపీ హైకమాండ్ ఇదివరకే స్పష్టం చేయడం తెలిసిందే.
సీఎం పదవిని నితీశ్ కు కట్టబెట్టే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని బీహార్ బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ అన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, ఇందులో ఎలాంటి గందరగోళం లేదని.. నితీశే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. సీట్ల సంఖ్య కాదు, భాగస్వామ్యమే ముఖ్యమని మోదీ అన్నారు.

2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ ఆ పదవిలో 8 రోజులున్నారు. 2005, 2010, 2015, 2017లో కలిపి మొత్తం ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 1977 ఎన్నికల్లో తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నితీశ్... ఆ తర్వాత 1985లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాతి కాలంలో శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతూ ఎన్నికల్లో పోటీచేయని ఆయన తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.












Click it and Unblock the Notifications