Bihar Results: బీహార్ ఫలితాల్లో తేజస్వీ వెనుకంజ..! 200 మార్క్ దిశగా ఎన్డీయే..!
బీహార్ లో ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇవాళ ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచీ సత్తా చాటుకుటున్న ఎన్డీయే పార్టీలు బీజేపీ, జేడీయూ గత రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. అదే సమయంలో ఈ ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకున్న విపక్ష మహాకూటమికి దారుణ ఓటమి తప్పేలా లేదు. తాజా ఫలితాల సరళి ప్రకారం ఎన్డీయే ఏకంగా 190 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు మహాకూటమి 50 సీట్ల మార్క్ కూడా అందుకునేలా కనిపించడం లేదు.
బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు రెండు విడతల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో ఆరంభంలో ఎన్డీయే, మహాకూటమి పోటా పోటీగా ఉన్నట్లు కనిపించాయి. కానీ ఆ తర్వాత పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన సీట్లలో సైతం మహాకూటమి పార్టీలు వెనుకబడిపోయాయి. మరోవైపు ఎన్డీయే పార్టీలు బీజేపీ, జేడీయూ పోటాపోటీగా ఆధిక్యాలు ప్రదర్శిస్తున్నాయి.

తాజా సమాచారం అందే సరికి బీజేపీ 76 సీట్లలోనూ, జేడీయూ 77 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి 190 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇదే సరళి కొనసాగితే 200 మార్క్ ను కూడా ఎన్డీయే టచ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరోవైపు మహాకూటమి పూర్తిగా చతికిలపడింది. ఓ దశలో 60 సీట్లలో ఆధిక్యం ప్రదర్శించిన మహాకూటమి పార్టీ ఆర్జేడీ.. ఆ తర్వాత క్రమంలో 30 సీట్లకు పడిపోయింది.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తన కంచుకోట రాఘోపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నట్లు తాజా ఫలితాల సరళి చెబుతోంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన తేజస్వీ యాదవ్.. రాఘోపూర్ లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్ధి సతీష్ కుమార్ కంటే వెయ్యి ఓట్లకు పైగా వెనుకంజలో ఉన్నారు. అలాగే తన సోదరుడు, ఆర్జేడీ రెబెల్ అభ్యర్ధి అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం మహువా సీట్లో 10 వేల ఓట్ల పైచిలుకు వెనుకబడి ఉన్నారు. దీంతో ఆయన ఓటమి ఖాయమైనట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications