భార్య పిలిచింది.. అత్తగారింటికి వెళ్ళాడు.. చివరకు శవమై వచ్చాడు!
Bihar Crime: భార్య, అత్తమామల వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. అత్తింటి వారు రూ.25 లక్షల కోసం పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తోంది.
అసలేం జరిగిందంటే?
బీహార్లోని సమస్తిపూర్ జిల్లా హలయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగ్‌పూర్‌కు చెందిన విశ్వజీత్‌కు 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. గత ఐదేళ్లుగా విశ్వజీత్ భార్య పుట్టింటిలోనే ఉంటోంది. జనవరి 11న భార్య పిలవడంతో విశ్వజీత్ అత్తగారింటికి వెళ్లాడు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన మరుసటి రోజు ఉదయం అతను రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జనవరి 20న చికిత్స పొందుతూ విశ్వజీత్ ప్రాణాలు విడిచాడు.

వైరల్ వీడియోలో విశ్వజీత్ ఆవేదన
విషయం తాగే ముందు విశ్వజీత్ ఓ వీడియో రికార్డు చేశాడు. అందులో తన బాధను ఈ విధంగా చెప్పుకొచ్చాడు. "నేను గత ఐదేళ్లుగా డిప్రెషన్‌లో ఉన్నాను. భగవంతుడు ఇలాంటి జీవితాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. నా అత్తగారింటి వారు నన్ను రూ. 25 లక్షలు ఇమ్మని వేధిస్తున్నారు. అంత పెద్ద మొత్తం నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? అందుకే చనిపోతున్నాను. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని నేను కోరుకునేది ఒక్కటే.. చట్టాలు కేవలం అమ్మాయిలకు అనుకూలంగానే ఉండకూడదు. నా భార్య నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. నా మరణం తర్వాత నా ఆస్తి మొత్తం నా తల్లిదండ్రులకే చెందాలి. నా భార్యకు ఏమీ దక్కకూడదు. నా చావుకు కారణమైన నా భార్య, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేయాలి" అని విశ్వజీత్ సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు.
పోలీసుల విచారణ
దర్బంగా జిల్లా లహెరియాసరాయ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. విశ్వజీత్ కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమిత్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వైరల్ వీడియోను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవి దుర్వినియోగ అవుతున్నాయనే ఆరోపణలకు ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications