స్వగ్రామంలో ఇల్లు, ఊరికి సేవ చేయాలనే కోరిక తీరకుండానే..: బిపిన్ రావత్ బంధువు కన్నీరు
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తోపాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ తన స్వగ్రామంలో ఉండాలని, తన సొంత ఊరికి సేవ చేయాలనే కోరిక తీరకుండానే ఈ ప్రమాదంలో కన్నుమూయడం విషాదాన్ని నింపింది.
జనరల్ బిపిన్ రావత్ తన స్వగ్రామాన్ని 2018లో సందర్శించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ తర్వాత అక్కడే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఈ విషయాలను ఆయన సమీప బంధువు 70ఏళ్ల భరత్ సింగ్ రావత్ వెల్లడించారు. గ్రామం వచ్చినప్పుడు ఆయన తమ కుల దేవతకు పూజలు చేశారని తెలిపారు.

స్వగ్రామం నుంచి ఉద్యోగరీత్యా వెళ్లడం చాలా బాధగా ఉందని, తిరిగి వచ్చాక గ్రామానికి ఎంతో కొంత చేయాలని ఉందని బిపిన్ రావత్ తనతో చెప్పారని భరత్ సింగ్ రావత్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ గ్రామానికి వస్తానని చెప్పారని.. అంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని బిపిన్ రావత్ సమీప బంధువు కన్నీటిపర్యంతమయ్యారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం కూనూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉండగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శాష్దోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన మహిళ కావడం గమనార్హం. మధులికా తండ్రి పేరు కున్వర్ మృగేందర్ సింగ్. హెలికాప్టర్ ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే మధులికా సోదరుడు యశ్వర్ధన్ సింగ్ భోపాల్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.
జనవరి 1, 2020లో బిపిన్ రావత్ భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా నియమితులయ్యారు. అయితే, రావత్ కుటుంబం ఎన్నో తరాలు భారత సైన్యంలోనే పనిచేస్తున్నాయి. ఆయన సతీమణి మధులికా ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)గా కొనసాగుతున్నారు. ఆర్మీ పర్సనల్ వ్యక్తుల భార్యలు, పిల్లల సంక్షేమం కోసం ఆమె పనిచేశారు.
Recommended Video
బిపిన్ రావత్, మధులిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు కృతికా రావత్. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత సైన్యంలో పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ పోస్టు వరకు ఆయన ఎదిగారు. ఆయన తల్లి ఉత్తరకాశీ నుంచి ఎమ్మెల్యే కిషన్ సింగ్ పరామర్ కూతురు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications