బర్డ్ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కాకులు మృతి: ప్రభుత్వం హైఅలర్ట్!
Bird Flu: తమిళనాడు రాజధాని చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వందలాది కాకులు అకస్మాత్తుగా చనిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మరణాలపై పరిశోధన చేసిన భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD), ఇది అత్యంత ప్రమాదకరమైన H5N1 వైరస్ అని ధ్రువీకరించింది.
వైరస్ వ్యాప్తి ఎక్కడెక్కడ?
చెన్నైలోని అడయార్, గాంధీ నగర్, పల్లికరణై, వేలచ్చేరి, తిరువాన్మియూర్ వంటి కీలక ప్రాంతాలతో పాటు ఈసీఆర్ (ECR), ఓఎంఆర్ (OMR) కారిడార్లలో కాకుల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. బేసంట్ మెమోరియల్ యానిమల్ డిస్పెన్సరీ అంచనా ప్రకారం.. గత కొన్ని వారాల్లో నగరంలో దాదాపు 1000 నుండి 1500 కాకులు మరణించి ఉండవచ్చు.

ప్రభుత్వం హెచ్చరికలు.. మార్గదర్శకాలు జారీ
బర్డ్ ఫ్లూ ధ్రువీకరణ కావడంతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. పక్షులు చనిపోయిన ప్రాంతాల్లో బయో-సెక్యూరిటీ చర్యలను కఠినతరం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. చనిపోయిన పక్షులను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా, లోతైన గొయ్యి తీసి శాస్త్రీయంగా ఖననం చేయాలని సూచించింది. పౌల్ట్రీ ఫారాలు, అటవీ ప్రాంతాలు, పక్షుల ఆవాసాలపై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొంది. ఆరోగ్య, అటవీ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రజలకు సూచనలు:
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు కింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడైనా పక్షులు అకస్మాత్తుగా చనిపోయి కనిపిస్తే వాటిని తాకవద్దు. వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. పక్షుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు, పౌల్ట్రీ రంగంలో ఉండేవారు మాస్కులు, గ్లౌజులు ధరించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అసాధారణ మరణాలు కనిపిస్తే రిపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇతర జాతులకు లేదా పెంపుడు పక్షులకు వ్యాపించకుండా ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం.












Click it and Unblock the Notifications