BJP: కేంద్రంలో, రాష్ట్రంలో మనమే అధికారంలో ఉన్నాము, అయినా చంపేస్తుంటే ఏం చెయ్యాలి ? !
బెంగళూరు/మంగళూరు: బీజేపీ యువమోర్చలో చురుకుగా ఉంటున్న ప్రవీణ్ (29) అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో అధికారంలో ఉన్న సొంతపార్టీ ప్రభుత్వం మీద బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మంగళవారం రాత్రి షాపు ముందు నిలబడి ఉన్న బీజేపీ నాయకుడిని బైక్ లో వెళ్లిన ప్రత్యర్థులు అతన్ని వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. ముస్లీం యువకుడి హత్యకు ప్రతీకారంగా బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యకు గురైనాడని వెలుగు చూడటంతో ఆప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కర్ణాటకలో వరుసగా హిందూ కార్యకర్తలు దారుణ హత్యకు గురౌతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు సామూహిక రాజీనామాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీ నాయకుడి దారుణ హత్య
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లార పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ మంగళవారం రాత్రి అతని షాపు ముందే దారుణ హత్యకు గురైనాడు.

పక్కాస్కెచ్ తో హత్య
కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ సందర్బంలో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికేశారు. పక్కాప్లాన్ ప్రకారం ప్రవీణ్ ను హత్య చేశారని వెలుగు చూడటంతో సాటి బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

సహనం కోల్పోయిన హిందూ సంఘాల కార్యకర్తలు
ప్రవీణ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో రాళ్లతో దాడులు చెయ్యకూడదని పోలీసులు మనవి చేసినా కొందరు పట్టించుకోలేదు. ఆ సందర్బంలో పోలీసులు లాఠీలను పని చెప్పడంతో అనేక మందికి తీవ్రగాయాలైనాయి

సామూహిక రాజీనామాలు
రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కర్ణాటకలో వరుసగా హిందూ కార్యకర్తలు దారుణ హత్యకు గురౌతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలో బీజేపీ యువమోర్చ నాయకులు, కార్యకర్తలు సామూహిక రాజీనామాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బాగల్ కోటేతో పాటు కర్ణాటలోని అనేక జిల్లాలోని బీజేపీ యువమోర్చ కార్యకర్తులు రాజీమానాలు చెయ్యడంతో ఇప్పుడు బీజేపీ నాయకులు వారికి సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారు.












Click it and Unblock the Notifications