కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన బీజేపీ: ఏకగ్రీవ ఎన్నిక
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కార్పొరేటర్ల ఎన్నికలు పూర్తి కాక ముందే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఎన్నికలు జరగక ముందే బీజేపీ కార్పొరేటర్ ఏకగ్రీవ ఎన్నిక కావడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కంగు తిన్నారు.
బెంగళూరు నగరంలోని బోమ్మనహళ్ళి శాసన సభ నియోజక వర్గంలో వందలాధి మంది ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు. ఈ నియోజక వర్గంలోని హోంగసంద్ర వార్డు (బీసీ-ఏ, మహిళా రిజర్వేషన్) నుండి బీజేపీ అభ్యర్థిగా భారతీ రామచంద్ర నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ పార్టీ నుండి మహేశ్వరి అనే మహిళ నామినేషన్ వేశారు. అయితే స్థానిక శాసన సభ్యుడు (బీజేపీ) సతీష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరి నకిలి కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరి నకిలి కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని వెలుగు చూడటంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఈ వార్డులో జేడీఎస్ పార్టీ నుండి ఎవ్వరు పోటిలో లేరు. స్వతంత్ర అభ్యర్థులుగా శ్వేతా, షహీనా అనే ఇద్దరు నామినేషన్ వేశారు. బుధవారం సాయంత్రం చివరి నిమిషంలో వారిద్దరు నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి భారతీ రామచంద్ర ఏకగ్రీవంగా గెలుపొందారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుల నోట్లో వెలక్కాయపడింది. టిక్కెట్ ఇచ్చినా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడంలో వారు విఫలం అయ్యారని మేము ఏమి చేస్తామని కాంగ్రెస్ నాయకులు సమర్థించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications