పంజాబ్ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు.. పాట్నాలో చన్నీపై పోలీసులకు ఫిర్యాదు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో నెట్టాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీకి చెందిన వారిని పంజాబ్‌లో అడుగు పెట్టనియ్యబోమంటూ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాస్పదమ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆప్ నేతలతో పాటు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తోందని మండుపడ్డారు.

పంజాబ్ సీఎం చన్నీపై బీజేపీ నేత ఫిర్యాదు
తాజాగా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై బీజేపీ పాట్నా నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్ ప్రజలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాట్నాలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బీజేపీకి చెందిన యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు మనీష్ కుమార్ సింగ్ కదమ్ కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పంజాబ్ సీఎం చన్నీ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని మండిపడ్డారు. అందుకే సీఎం చన్నీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత తెలిపారు.

ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా కాంగ్రెస్..
ప్రధాని మోదీ కూడా పంజాబ్ సీఎం చన్నీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి విభేదాలను రెచ్చగొడుతున్న పార్టీలకు పరిపాలించే అధికారం ఉండకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాలన కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చన్నీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ
అటు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం చన్నీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలోనే చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ చిరునవ్వు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాస్పదం కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది.. పంజాబ్‌ను పంజాబీయులే పాలించుకోవాలని.. వారి సమస్యలు వారికే తెలుస్తాయన్న ఉద్దేశంతో చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. తమకు ఎలాంటి ప్రాంతీయ బేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications