మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా గెలవలేదు: దేవేంద్ర ఫడ్నవీస్ సంచలనం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా గెలవలేదని అన్నారు. అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌కు నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల గురించి ప్రాక్టికల్‌గా ఉండాలని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. మహాయుతి మిత్రపక్షాలైన బీజేపీ, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలు ఐక్యంగా పోరాడి ఎన్నికల్లో విజయం సాధిస్తాయని దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

పార్టీలో టికెట్ ఆశించి భంగడిన నేతలు తిరుగుబాటుదారులుగా మారే ప్రమాదంపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. కొందరు నేతలకు అవకాశం లభించపోవడం కాస్త బాధగానే ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అనేక సినిమాల్లో చూపించినట్లుగా.. ప్రతీ ఔత్సాహిక నటుడు ప్రధాన పాత్ర పోషించినట్లుగానే ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా గెలవలేదు. కానీ, అధిఖ సంఖ్యలో సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఓటింగ్ శాతం కూడా పెంచుకుంటుందన్నారు. మూడు పార్టీలు సాధించే ఓట్లతో రాష్ట్రంలో తప్పకుండా విజయం సాధిస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ బీజేపీ 121 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 48 స్థానాల్లో కేవలం 17 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయంపై స్పందిస్తూ.. ఇది ఓట్ జిహాద్ ఫలితమని ఫడ్నవీస్ అన్నారు.
'ధూలే లోక్‌సభ నియోజకవర్గంలో, మా అభ్యర్థి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉన్నారు, కానీ, మాలెగావ్-సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ మా ఓటమికి దారితీసింది. అయితే, ఆ ఐదు స్థానాల్లో మా అభ్యర్థులు గెలుస్తారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో అది పని చేయదు' అని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications