కుట్ర!: తప్పని స్థితిలో నటి రూపా గంగూలీని పక్కన పెట్టిన బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ (కేఎంసీ) ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో తమ పార్టీకి చెందిన నటి రూపా గంగూలీని పక్కన పెట్టారు. కేఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే తమ పార్టీలో చేరిన రూపా గంగూలీని బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఫోకస్ చేసింది.
మహాభారత్ మెగా టీవీ సీరియల్లో ద్రౌపతి పాత్ర పోషించిన ఆమె పాపులర్ నటి. ఆమె కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. కోల్‌కతాలో కేఎంసీ ఎన్నికల్లో గెలుపొందే వ్యూహంలో భాగంగా బీజేపీ ఆమెను మేయర్ అభ్యర్థిగా ఫోకస్ చేసింది. అయితే, ఇప్పుడు ఆమె పోటీ చేయని పరిస్థితి ఏర్పడింది.
పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల యాక్ట్, 1994 ప్రకారం సదరు మున్సిపాలిటీలో ఓటు హక్కు లేకుంటే అలాంటి వారు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అనర్హులు. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు.

దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అధికార టీఎంసీ కనుసన్నుల్లో పని చేస్తోందని ఆరోపించారు. రూపా గంగూలీ ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. తాము రూపా గంగూలీ స్థానంలో మరో నటి షర్బరీ ముఖర్జీని పోటీలో నిలుపుతున్నట్లు చెప్పారు. రూపా గంగూలీ 96వ వార్డు నుండి పోటీ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఆమె పోటీ చేయడం లేదు.
తన పోటీకి అడ్డంకి వచ్చిన అంశంపై రూపా గంగూలీ మాట్లాడుతూ... ఓటర్ లిస్టులో తన పేరును చేర్పించేందుకు తాను పలుమార్లు ప్రయత్నంచానని, తాను కోల్‌కతాలో ఇరవై ఏళ్లుగా ఉంటున్నానని, ఇప్పుడు టీఎంసీ అధికారంలోకి వచ్చాక తన పేరును లిస్ట్ నుండి తీసేశారని ఆరోపించారు. తాను టీఎంసీకి అనుకూలం కాదని అందరికీ తెలుసునని చెప్పారు.












Click it and Unblock the Notifications