అభ్యర్థుల కిడ్నాప్‌కు పాల్పడుతోన్న బీజేపీ - ఆప్ సంచలన ఆరోపణ
అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుకుంటోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రభావం ఎంతమేర ఉందనేది ఈ ఎన్నికలు స్పష్టం చేయనున్నాయి.

హోరాహోరీగా..
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది.

త్రిముఖ పోరు..
మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తోంది. బీజేపీకి ఇదివరకట్లా గెలుపు నల్లేరు మీద నడక కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరోసారి అధికారాన్ని అందుకోవడానికి శ్రమించక తప్పదనే విశ్లేషణలూ ఉన్నాయి.

సంచలన ఆరోపణ..
ఈ పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. సంచలన ఆరోపణలను గుప్పించారు. బీజేపీని ఆయన టార్గెట్‌గా చేసుకున్నారు. కమలనాథులకు ఓటమి భయం పట్టుకుందని మండిపడ్డారు. తమ పార్టీ నాయకులను అపహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. అవాంఛనీయ సంఘటనలకు బీజేపీ నాయకులు కారణమౌతోన్నారని విమర్శించారు.

బీజేపీ అభ్యర్థి కిడ్నాప్
సూరత్ తూర్పు నియోజకవర్గానికి చెందిన తమ పార్టీ అభ్యర్థి కంచన్ జరీవాలాను బీజేపీ నాయకులు అపహరించారని మనీష్ సిసోడియా ఆరోపించారు. చివరిసారిగా మంగళవారం ఆర్ఓ ఆఫీస్‌లో కంచన్ జరీవాలా కనిపించారని, అప్పటి నుంచి అందుబాటులో లేరని పేర్కొన్నారు. కంచన్ జరీవాలాను కిడ్నాప్ చేసిన బీజేపీ నాయకులు తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తోన్నారని అన్నారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications