మారిన ఈక్వేషన్లు- బీజేపీకి పొగ: మాజీమంత్రికి కాంగ్రెస్ కండువా
CP Yogeswar: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.
రెండు రోజుల కిందటే బీజేపీకి గుడ్‌బై చెప్పారు యోగేశ్వర్. తొలుత తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మండలి ఛైర్మన్ బసవరాజ్ హోరట్టికి అందజేశారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నీ వదులుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్రకు పంపించారు.

ఆయన రాజీనామా చేయడానికి కారణాలు లేకపోలేదు. చెన్నపట్టణ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించారు. దీనికి బీజేపీ అంగీకరించలేదు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనతాదళ్ (సెక్యులర్)కు కేటాయించాలని నిర్ణయించింది.
ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి.. లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీనితో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన చెన్నపట్టణ స్థానానికి నవంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. దీనితో పాటు సండూరు, శిగ్గావ్ స్థానాలకూ ఉప ఎన్నిక అదే రోజున ఉంటుంది.
కుమారస్వామి సొంత నియోజకవర్గం కావడం వల్ల దీన్ని జేడీఎస్‌కే కేటాయించింది బీజేపీ. అటు యోగేశ్వరకు కూడా ఇదే సొంత స్థానం కావడం విభేదాలకు కారణమైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగేశ్వర బీజేపీ అభ్యర్థిగా చెన్నపట్టణ నుంచే పోటీ చేసి, 15 వేలకు పైగా ఓట్ల తేడాతో కుమారస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఉప ఎన్నికలో మళ్లీ అవకాశం లభించినప్పటికీ ఈ స్థానం మిత్రపక్షం జేడీఎస్‌కు వెళ్లడం ఆయన ఇష్టం లేదు. తాను పోటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల సీపీ యోగేశ్వర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీనితో చెన్నపట్టణ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా యోగేశ్వర్ పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్టే.
పీసీసీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జహీర్ అహ్మద్, శివరాజ్ తంగడగి, ఎమ్మెల్యేలు కడలూర్ ఉదయ్ గౌడ, పొన్నన్న, యతీంద్ర సిద్ధరామయ్యతో కలిసి సిద్దరామయ్య అధికారిక నివాసం కావేరీ భవన్‌కు వెళ్లారు. అంతకుముందు- డీకేశిని ఆయన నివాసంలో కలిశారు. పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications