బెంగళూరు మీద కన్నుపడింది, క్యూలో ఉన్నారు, ప్రధాని మోదీ ఏం చేస్తారో అని అందరూ వెయిటింగ్ !
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు డీవీ సదానందగౌడ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం ఎంపీ అయిన మాజీ సీఎం డీవీ సదానందగౌడ వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టంగా వెలుగు చూసింది.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మాజీ సీఎం డీవీ సదానందగౌడ బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపారు. బీజేపీ హైకమాండ్ సూచనల మేరకు డీవీ సదానందగౌడ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారని తెలిసింది. కర్ణాటకలోని సుమారు 11 నుంచి 13 మంది సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదని బీజీపీ హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది. అందులో బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం ఎంపీ డీవీ సదానందగౌడ కూడా ఒక్కరు అని సమాచారం.

బీజేపీ బలంగా ఉన్న బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం మీద అనేక మంది బీజేపీ నాయకుల కన్నుపడింది. కేంద్ర మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్, ఉడిపి-చిక్కమగళూరు బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఎందుకంటే శోభా కరంద్లాజే బెంగళూరులోని యశవంతపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి కర్ణాటక మంత్రిగా పని చేశారు.
బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం పరిధిలోనే యశవంతపురం ఉండటంతో తాను కచ్చితంగా విజయం సాధిస్తానని శోభా కరంద్లాజే ధీమాగా ఉన్నారని తెలిసింది. ఇక కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పార్టీలో అధికారికంగా పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చెయ్యాలని దాదాపు నిర్ణయం తీసుకున్నాయి.
బీజేపీ-జేడీఎస్ పొత్తులో భాగంగా మండ్య లోక్ సభ నియోజక వర్గం, మైసూరు- కొడుగు లోక్ సభ నియోజక వర్గాలు తమకు కావాలని జేడీఎస్ డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిసింది. మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు ఇస్తే అక్కడి సిట్టింగ్ ఎంపీ సుమలతా అంబరీష్ వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సుమలతా కూడా బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం సీటు ఆశించే అవకాశం ఉంది.

సుమలతా అధికారికంగా బీజేపీలో చేరిన తరువాత ఆమె తనకు బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం సీటు ఇవ్వాలని మనవి చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇక మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు ఇస్తే అక్కడి సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సైతం వేరే నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాల్సి ఉంటుంది. ప్రతాప్ సింహా కూడా బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం మీద కన్ను వేశారని వెలుగు చూసింది.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కర్ణాటక ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ కూడా బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని ఆలోచిస్తున్నారని తెలిసింది. చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన బచ్చేగౌడ ఇప్పుడు బీజేపీకి దూరం అయ్యారు. బచ్చేగౌడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే కావడంతో బచ్చేగౌడ బీజేపీకి గుడ్ బై చెప్పారు.
ఇదే సమయంలో చిక్కబళ్లాపురం లోకల్ అయిన డాక్టర్ సుధాకర్ చిక్కబళ్లాపురం లోక్ సభ టిక్కెట్ కూడా అడిగే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం టిక్కెట్ కోసం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, మాజీ మంత్రి సీటీ రవి, సిట్టింగ్ ఎంపీలు సుమలతా అంబరీష్, ప్రతాప్ సింహా, మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ తదితరులు పోటీ పడుతున్నారని స్పష్టం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications