తెలంగాణలో బళ్లారి శ్రీరాములు, డీకే శివకుమార్ ఢీ: హైకమాండ్ ఆదేశాలతో మాస్ లీడర్స్ ఎంట్రీ!
హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ ఉపాద్యక్షుడు బళ్లారి శ్రీరాములు, కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ మళ్లీ నువ్వానేనా అంటూ తలపడుతున్నారు. నెల రోజుల క్రితం బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన శ్రీరాములు, డీకే. శివకుమార్ ఇప్పుడు పొరుగు రాష్ట్రం తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవడం కోసం ఢీకొంటున్నారు.

త్రిబుల్ షూటర్
తెలంగాణలోని కొన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ కు సూచించింది. రాజకీయ చాణుక్యుడిగా, త్రిబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డీకే. శివకుమార్ సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు.

బళ్లారి శ్రీరాములు అస్త్రం
తెలంగాణలో బీజేపీ బరిలో ఉన్న శాసన సభ నియోజక వర్గాల్లో బళ్లారి శ్రీరాములుతో ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తెలుగు బాష అనర్ఘలంగా మాట్లాడే బళ్లారి శ్రీరాములు కార్యకర్తలను ఆకట్టుకుంటారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

సరిహద్దు ప్రాంతాలు
బళ్లారి శ్రీరాములుకు ఉత్తర కర్ణాటకలోని సరిహద్దులు, తెలంగాణ ప్రాంతం సరిహద్దుల్లోని నాయకులు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్ణూలు జిల్లా సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతం నాయకులు, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. బళ్లారి శ్రీరాములు పరిచయాలను శాసన సభ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.

చంద్రబాబుతో డీకే ప్రచారం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో స్థిరపడిన కన్నడిగులను ఆకట్టుకోవడానికి డీకే. శివకుమార్ ప్రయత్నించారు. తెలంగాణలో తెరాస, బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటిమికి ఓట్లు వేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని డీకే. శివకుమార్ స్థానిక ఓటర్లకు మనవి చేశారు.

మాస్ లీడర్ శ్రీరాములు
కర్ణాటకలో మాస్ లీడర్ గా శ్రీరాములుకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే శ్రీరాములు తెలంగాణలోని పలు నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు. బుధవారం నాటికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండటంతో వీలైనన్ని శాసన సభ నియోజక వర్గాల్లో, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో బళ్లారి శ్రీరాములతో ప్రచారం చేయించాలని తెలంగాణలోని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications