పార్టీ ఆవిర్భావోత్సవానికి పిలవలేదు: అద్వానీకి మళ్లీ అవమానం!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానికి మరోసారి అవమానం ఎదురైంది. భారతీయ జనతా పార్టీ సోమవారం నాడి దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో 35వ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించింది. అయితే, ఈ సమావేశానికి అద్వానీకి అధికారికంగా ఆహ్వానం అందలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ.. అద్వానీకి ఎలాంటి సందేశం పంపించలేదని తెలుస్తోంది. కనీసం టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, బెంగళూరులో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అద్వానికి పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడంతో చిన్నబుచ్చుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సమావేశాల్లో ప్రసంగించాలన్న నేతల అభ్యర్థనలను ఆయన తోసిపుచ్చారు. అద్వానీ జ్యోతి ప్రజ్వలనకే పరిమితం అయ్యారు.

బెంగళూర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా అద్వానీకి పెద్దగా స్థానం దక్కలేదు. బిజెపి 35 ఏళ్ల చరిత్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అద్వానీ సంప్రదాయబద్దమైన ముగింపు ప్రసంగం చేయకపోవడం ఇది రెండోసారి. ప్రసంగం చేయాలని శుక్రవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు.
నిరుడు బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన అమిత్ షా పార్టీలో పలు వ్యవస్థాగత మార్పులు చేశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, మురళీమనోహర్ జోషీలను ఆయన తొలగించారు. వారిని మార్గదర్శక్ మండల్‌కు మాత్రమే పరిమితం చేశారు.
పార్టీ స్థాపన జరిగిన 1980 నుంచి వారు పార్లమెంటరీ బోర్డులో కొనసాగుతూ వస్తున్నారు. వారిని దాని నుంచి తొలగించడం ద్వారా వాజ్‌పేయ్, అద్వానీ యుగం ముగిసిందని చెప్పకనే చెప్పారని అంటున్నారు. మార్గదర్శక్ మండల్ పాత్ర నిర్ణయాలు తీసుకోవడంలో ఏమీ లేదు.
ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయడంలో కూడా దాన్ని సంప్రదించలేదు. పార్లమెంటుకు అద్వానీ హాజరవుతున్నప్పటికీ ఏమీ మాట్లాడడం లేదు. 2013లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా అద్వానీ ముగింపు ప్రసంగం చేయలేదు. బెంగళూర్ సమావేశం సందర్భంగా అద్వానీ, ప్రధాని నరేంద్ర మోడీ ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు.












Click it and Unblock the Notifications